టీఎంసీ, భాజపా... బంగాల్ శాసనసభ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు. విజయమే లక్ష్యంగా నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి ఈ పార్టీలు. ఈ సంగ్రామంలో ఎవరి వ్యూహాలు వారివి. అయితే... పూర్తి భిన్న ధ్రువాలుగా కనిపిస్తున్న ఈ పార్టీల మధ్య ఓ సారూప్యత కనిపిస్తోంది. గెలుపు గుర్రాలంటూ ఫిరాయింపుదారులకు పెద్దపీట వేశాయి టీఎంసీ, భాజపా. ఇప్పటికే సత్తా చాటుకున్న నేతలను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గణనీయమైన సంఖ్యలో సీట్లు కేటాయించాయి. ఈ వ్యూహం ఏమేర ఫలిస్తుందో స్పష్టత లేకపోయినా... ప్రస్తుతానికైతే రెండు పార్టీలు సొంత నేతల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నాయి.
టీఎంసీలో 16 మంది..
అసెంబ్లీ ఎన్నికలకు 291 మంది అభ్యర్థులను ఖరారు చేసింది అధికార టీఎంసీ. అందులో 16 మంది ఫిరాయింపుదారులు ఉన్నారు.
భాజపాలో 22 మంది..
బంగాల్ ఎన్నికల కోసం భాజపా ఇప్పటి వరకు ప్రకటించిన 122 మంది అభ్యర్థుల జాబితాలో 22 మంది ఫిరాయింపుదారులు ఉండటం గమనార్హం. అందులో ప్రధానంగా బంగాల్ మాజీ మంత్రి సువేందు అధికారి, రాజీబ్ బెనర్జీ వంటి టీఎంసీ మాజీ నేతలు ఉన్నారు.
అభ్యర్థుల ఎంపికపై ఆందోళనలు..
టీఎంసీ ఫిరాయింపుదారు, 80 ఏళ్ల వయసు పైబడిన రవీంద్రనాథ్ ఘోష్‌ను ఎంపిక చేయటం పట్ల హూగ్లీ జిల్లా భాజపా సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు నిరసనకు దిగారు.
భాజపాలో చేరిన టీఎంసీ నేతలు సంతాను బాపులి, అర్ణబ్ రాయ్, దీపక్ కుమార్ రాయ్, గోర్ఖా జనముక్తి మోర్చా ఫిరాయింపుదారు బిషాల్ లామా, లెఫ్ట్ డిఫెక్టర్ రింకు నాస్కర్, బిస్వనాత్ కరక్ ఎంపికను నిరసిస్తూ.. కోల్‌కతా, ఉత్తర బంగాల్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఐదుగురు మంత్రులకు ఈసారి మొండి చేయి చూపడంపై టీఎంసీ సైతం తమ మద్దతుదారుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది. సుమారు 160 స్థానాల్లో కొత్తవారిని పోటీకి దింపడం లేదా అభ్యర్థులను మార్చడం వంటివి చేసింది తృణమూల్ కాంగ్రెస్.
సమర్థించుకున్న పార్టీలు..
అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొన్నప్పటికీ.. తమ నిర్ణయాలను సమర్థించుకున్నాయి రెండు పార్టీలు. విజయావకాశాలు ఉన్న వారికే ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పుకొచ్చాయి.
నిజానికి... ఫిరాయింపుదారులకు భాజపా టికెట్లు ఇవ్వడం అనివార్యంగా మారింది. ఇటీవల కాలంలో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో గణనీయంగా పుంజుకున్నా... 294 స్థానాలకు సరిపడా దీటైన అభ్యర్థులు లేరు. ఫలితంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయక తప్పలేదని చెబుతున్నారు కమలదళం నేతలు.
అయితే ఇలా చేయడం వల్ల పార్టీలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చడమూ సీనియర్ నేతలకు సవాల్‌గా మారింది.
" పార్టీ కోసం పని చేసే నాయకులు, కార్యకర్తలు మాకు ఉన్నారు. బంగాల్లో మా పార్టీ అభివృద్ధి చెందుతోంది. వీలైనంత మంది ప్రముఖులను మాతో చేర్చుకోవటం ఇప్పుడు తప్పనిసరి. ఇతర పార్టీల్లో గెలుపొంది మా పార్టీలోకి వచ్చిన వారందరికీ టికెట్లు అందవు. అలాగే.. ప్రతిఒక్కరినీ ఎన్నికల్లో నిలపటం సాధ్యం కాదు. "
- దిలీప్ ఘోష్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
- భాజపా 59 మందితో ప్రకటించిన తొలి జాబితాలో 8 మంది ఫిరాయింపుదారులు ఉన్నారు. అందులో సువేందు అధికారి, సీపీఎం మాజీ ఎమ్మెల్యే తపసి మండల్ వంటి కీలక నేతలు ఉన్నారు.
- రెండో జాబితాలోని 63 మందిలో 12 మంది ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరినవారే.
- భాజపాలో టికెట్టు దక్కని 8 మంది నేతలు స్వతంత్రంగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.