TTD Vaikunta Ekadasi 2023:మోక్షం లభించాలంటే.. వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే.. ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలోనూ ఉత్తరం వైపున్న ద్వారం నుంచి స్వామి దర్శనం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని వేదవాక్కు. అందుకే.. ఆ రోజును మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23వ తేదీన వచ్చింది. ఈ క్రమంలో మీరు కూడా వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల వెళ్లాలని అనుకుంటే.. వైకుంఠ ద్వారదర్శనం ఎన్ని రోజులు ఉంటుంది? టోకెన్లు ఎన్ని అందుబాటులో ఉంటాయి? వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.
తిరుమలలో డిసెంబర్ ఉత్సవాల లిస్టు ఇదే - ఆ 10 రోజులు దర్శనాలు రద్దు!
Vaikunta Dwara Darshan 2023 in Tirumala: తిరుమలలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు.. మొత్తం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఇందుకోసం టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనానికి(Vaikunta Ekadasi 2023 Tickets) సంబంధించిన రూ.300 టికెట్లను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. ఆఫ్‌లైన్ టికెట్లను తిరుపతి(Tirupati)లో డిసెంబర్ 22న కౌంటర్ల ద్వారా.. జారీ చేయనుంది. భక్తుల సౌకర్యార్ధం తిరుపతి, తిరుమలలో 10 కేంద్రాల్లో డిసెంబర్ 22 నుంచి 4.25 లక్షల టోకెన్లు ఇవ్వనుంది. అంటే రోజుకు 42,500 చొప్పున పది రోజుల్లో మొత్తంగా 4.25 లక్షల టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అందువల్ల.. మీరు తిరుమల వెళ్లే ఆలోచనలో ఉంటే మాత్రం ఈ టోకెన్లు పొందడం ఉత్తమం.
Vaikunta Ekadasi 2023 at Tirumala : అలాగే, వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గదుల కేటాయింపులో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు, అదేవిధంగా డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 1 వరకు.. దాతలకు, వారి సిఫార్సు లేఖలతో వచ్చే వారికి గదుల కేటాయింపు ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఆన్లైన్లో శ్రీవారి దర్శనం కోసం బుక్ చేసుకున్న దాతలను రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా అనుమతించనున్నారు. దాతలందరికీ జయవిజయుల వద్ద నుంచి మహాలఘు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ(TTD) పేర్కొంది. ఇక.. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్న వేళ.. ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.