TTD Cancels Sarva Darshan Tickets: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు:డిసెంబరు 22న శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో మంజూరు చేసే సర్వ దర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. భక్తులు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వ దర్శనంలో ఆరోజు శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపింది. అలాగే అదే రోజు(డిసెంబరు 22) మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో.. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రారంభమవుతుంది. టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్లు జారీ చేస్తారు. అదే విధంగా ఆ రోజునే తిరుమలలోని స్థానికులకు ఉదయం 9 గంటలకు 5వేల దర్శన టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - మార్చి నెల ఆర్జిత సేవా టికెట్ల షెడ్యూల్ రిలీజ్!
ఏకాదశిన స్వర్ణరథం:డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తోంది. డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 10 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై మధ్యాహ్నం 12 గంటల నుంచి భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో గల 700 శ్లోకాలతో సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తారు.