TSPSC Exam Paper Leak accused Praveen: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడు సాగించిన అక్రమాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సోమవారం పోలీసులు ప్రవీణ్, సహచర ఉద్యోగి రాజశేఖర్ నుంచి ఏఈ సివిల్, టౌన్ ప్లానింగ్ ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో గురుకుల ప్రశ్నపత్రాలు సైతం లీకై ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు దాన్ని నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 4 పెన్ డ్రైవ్‌లలో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.
TSPSC Exam Paper Leak News : గతేడాది జరిగిన గ్రూప్-1 పరీక్షకు ప్రవీణ్ హాజరైనట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఆ పరీక్షలో ఇతడు మెయిన్స్ రాసేందుకు అర్హత సాధించలేకపోయినట్టు గుర్తించారు. అతను ఈ పరీక్షా పేపర్ లీక్ చేశాడా అనే అంశంపై దృష్టిపెట్టారు. శిక్షణా కేంద్రానికి వెళ్లి గ్రూప్-1 పరీక్షపై సంప్రదింపులు జరిపిన వ్యక్తి ప్రవీణేనా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు.
ఏ పని కావాలన్నా క్షణాల్లో పూర్తిచేయించగల స్థాయి:ప్రవీణ్‌కుమార్ పోలీసు అధికారి కుటుంబం నుంచి రావటంతో టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోనూ గౌరవం లభించేది. విధినిర్వహణలో వినయ విధేయలతో మెలుగుతూ ఉన్నతాధికారులకు దగ్గరయ్యాడు. పరీక్షాదుల వివరాలు, దరఖాస్తులు, ప్రశ్నపత్రాలు భద్రపరిచే కంప్యూటర్లున్న గదిలోకి చొరవగా వెళ్లేంత స్వేచ్ఛను సంపాదించాడు. ఏ పని కావాలన్నా క్షణాల్లో పూర్తిచేయించగల స్థాయికి చేరాడు. కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా బాధ్యతలు చేపట్టాడు.
2017లో గురుకుల ప్రిన్సిపళ్ల నియామకం జరిగింది. పరీక్ష రాసేందుకు విద్యార్హతలతోపాటు నిర్దేశించిన సమయం.. అధ్యాపకులుగా పనిచేసిన అనుభవం ఉండాలనే నిబంధన ఉండేది. ఆ సమయంలో అధ్యాపకులుగా అనుభవం లేకపోయినా దరఖాస్తు చేసుకునేందుకు కొందరు మహిళా అభ్యరులకు ప్రవీణ్ సహకరించాడనే ఆరోపణలున్నాయి. దరఖాస్తుల తిరస్కరణ, అనుమానాల నివృతి కోసం కార్యాలయానికి వచ్చే మహిళలు, యువతుల ఫోన్ నెంబర్లు ప్రవీణ్ తీసుకునేవాడు. అందులో కొందరు మహిళలకు.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు సహకరిస్తానంటూ ప్రవీణ్ వల విసిరాడు. అదే సమయంలో పరిచయమైన గురుకుల హిందీ ఉపాధ్యాయిని రేణుక, ఆమె భర్త ఢాక్యా నాయక్‌తో కలిసి ప్రశ్నపత్రాలు లీకు చేసి అడ్డంగా చిక్కాడు.