Tripura married woman incident: భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో 15 మందితో కలిసి భార్యపై దాడి చేశాడు ఓ భర్త. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య స్పృహ కోల్పోయింది. ఆమె స్పృహలోకి రాగానే ప్రియుడిని వివాహం చేసుకోమని అక్కడున్న వారందరూ బలవంత పెట్టారు. కొంతమంది యువకులు మహిళ నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టమని ప్రియుడిని ఇబ్బంది పెట్టారు. ఆమె ప్రియుడిని సైతం చితకబాదారు. ఈ ఘటన త్రిపురలోని కొవాయి జిల్లాలోని మధ్య కృష్ణాపుర్లో శనివారం జరిగింది. బాధితురాలు నడివయస్కురాలని తెలియమురా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
తన భార్యకు అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని బాధితురాలి భర్త తెలిపాడు. గాయాలతో బాధపడుతున్న భార్యను తెలియమురా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించానని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రస్తుత నాగరిక సమాజంలో మహిళలపై ఇలాంటి దాడులు జరగడం దారుణమని త్రిపుర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ బర్నాలి గోస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.