Bastar Independence day celebrations: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏనాడూ పంద్రాగస్టు వేడుకలకు వేదికలు కాని గ్రామాల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఉగ్రవాద దుశ్చర్యలకు, నక్సలైట్ల హింసాయుత ఉద్యమాలకు ఇప్పటివరకు నెలవైన ఆ పల్లెలు.. 75ఏళ్లలో తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవంలో భాగమయ్యాయి. ఒక గ్రామం ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లాలోని చందమేట కాగా మరొకటి జమ్ముకశ్మీర్ బుడ్గాంలోని సుయ్బాఘ్.
'ఎర్ర' కోటలో అమృతోత్సవ స్ఫూర్తి..
చందమేట.. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ మారుమూల గ్రామం. బస్తర్ జిల్లాలో ఒడిశా సరిహద్దుల్లో ఉంటుందీ పల్లె. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో ఇక్కడ ఎప్పుడూ పంద్రాగస్టు వేడుకలు నిర్వహించలేదు. నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండడమే ఇందుకు కారణం. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారింది. నక్సలిజంపై పోరులో భద్రతా సిబ్బంది గణనీయమైన పురోగతి సాధించడం, వేర్వేరు కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలకు దగ్గరవడం ఇందుకు దోహదం చేశాయి. ఫలితంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ జెండా పండుగకు వేదికైంది చందమేట. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కవర్ చేసింది ఈటీవీ భారత్.
భద్రతా సిబ్బంది సోమవారం ఉదయమే చందమేట గ్రామానికి చేరుకున్నారు. స్థానికులందరితో మాట్లాడి, దగ్గరుండి పంద్రాగస్టు వేడుకలు జరిపించారు. ఈ వేడుకతో గ్రామస్థులు ఆనందంలో మునిగిపోయారు. 'భారత్ మాతా జై' అంటూ నినాదాలు చేశారు. తొలిసారి జెండా పండుగలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, త్రివర్ణ పతాకం ప్రాముఖ్యం ఏంటో అర్థమైందని చందమేట గ్రామస్థులు ఈటీవీ భారత్‌కు చెప్పారు.