స్వాతంత్య్రం లభించిన తర్వాత తొలిసారి గిరిజనుల కళలు, సంస్కృతి, సంప్రదాయాలను దేశం సగర్వంగా స్మరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటానికి గిరిజనులు అందించిన సహకారాన్ని గుర్తిస్తున్నట్లు చెప్పారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశం జనజాతీయ గౌరవ్ దివస్ (Janjatiya Gaurav Divas) జరుపుకుంటోందని తెలిపారు. గోండు రాణి దుర్గావతి, రాణి కమల్పతి, వీర్ మహారాణా ప్రతాప్ వంటి యోధుల సాహసాలను దేశం మర్చిపోదని అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో (PM Modi Bhopal visit) నిర్వహించిన జనజాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళన్‌లో (Birsa Munda Jayanti) పాల్గొన్న మోదీ.. గిరిజనుల ఆటపాటల్లో జీవిత సందేశం ఉంటుందని కొనియాడారు. గత పాలకులు గిరిజనుల బాగోగులను పట్టించుకోలేదని కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. గతంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రస్తుతం కృషి జరుగుతోందని తెలిపారు.
"దేశాభివృద్ధికి గిరిజన సమాజం అందించిన సహకారం గురించి మాట్లాడితే చాలా మంది ఆశ్చర్యపోతారు. భారత దేశ సంస్కృతిని బలోపేతం చేయడంలో వారిదే కీలక పాత్ర అని చెబితే నమ్మరు. ఎందుకంటే వారి గురించి గతంలో ఎవరూ ఇలా చెప్పలేదు. వారి సేవలను గుప్తంగా ఉంచారు. లేదా పరిమిత సమాచారం ఇచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన వారి వల్ల ఇలా జరిగింది. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కారణంగా గిరిజనులు, వారి సంస్కృతి సంప్రదాయాలు మరుగునపడ్డాయి. దేశ జనాభాలో 10 శాతంగా ఉన్నప్పటికీ.. గిరిజనుల సమస్యలు, విద్య, వైద్యం గురించి వారు(గత పాలకులు) పట్టించుకోలేదు. గతంలో వెనుకబడిన వంద జిల్లాల్లో ఇప్పుడు అభివృద్ధి జరుగుతోంది."