దుబాయ్ టూర్‌కు వెళ్లిన హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ సారిన్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. దుబాయ్ నుంచి తిరిగి ఇండియా వచ్చే సమయంలో ట్రావెల్ ఏజెన్సీ నకిలీ టికెట్ ఇచ్చి వారిని తీవ్ర ఇబ్బందిని కలుగజేసింది.
HC మాజీ సీజేకు ట్రావెల్ ఏజెన్సీ బురిడీ.. దుబాయ్ టు దిల్లీకి నకిలీ టికెట్ ఇచ్చి.. - Lokayukta of Delhi
దుబాయ్ వెళ్లి టూర్ ముగించుకొని ఇండియా వచ్చే సమయంలో ఓ హైకోర్ట్ రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తికి ట్రావెల్ ఏజెన్సీ వారు నకిలీ టికెట్‌ను ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చేసేదేమి లేక ఆయన వేరే టికెట్స్ బుక్ చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. అసలేం జరిగిందంటే?
ఇదీ జరిగింది..
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. జస్టిస్ మన్మోహన్ సారిన్ జులై 4న భార్యతో కలిసి ఆయన దుబాయ్ వెళ్లారు. ఆ సమయంలో ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్లడానికి బిజినెస్ క్లాస్ టికెట్‌ను బుక్ చేసుకున్నారు. వెళ్లేటప్పుడు ట్రావెల్ ఏజెన్సీ ఆయనకు బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చింది, కానీ రిటర్న్‌లో ఇచ్చిన టికెట్ నకిలీది.
తిరుగు ప్రయాణంలో టికెట్ ప్రింటింగ్‌కు ఆయన చేరుకోగా అక్కడ టికెట్ లేదని చెప్పారు. వెంటనే ఆయన దిల్లీ హైకోర్టు ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించారు. బిజినెస్ క్లాస్‌లో సీట్లు రాకపోవడం వల్లే ఇలా జరిగిందని వాళ్లు చెప్పారు. దీంతో ఎకానమీ క్లాస్ టికెట్ కోసం డబ్బులు చెల్లించి ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.