Train Accident In Odisha : ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాదం మరవకముందే మరో ఘటన జరిగింది. సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు ట్రైన్ దిగి కిందకు పరిగెత్తారు.
ఇదీ జరిగింది..
సికింద్రాబాద్ నుంచి అగర్తలా వెళ్తున్న రైలు బ్రహ్మపుర స్టేషన్‌కు చేరుకోగానే B5 కోచ్‌లో మంటలు చెలరేగాయి. రైలులో పొగ రావడం చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. రైలులో ప్రయాణిస్తున్న కొంతమంది బీ5 కోచ్ నుంచి పొగ రావడం చూసి.. అత్యవసర అలారంను మోగించారు. మరికొంత మంది రైలునుంచి దిగి అందులో ప్రయాణించేది లేదని తేల్చి చెప్పారు. తక్షణమే మరొక కోచ్‌ను ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేశారు. అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. ఎయిర్ కండిషనర్‌లో జరిగిన చిన్న షాట్ సర్య్కూట్ వల్ల కోచ్‌లో పొగ ఏర్పడి ఉండవచ్చని రైల్వే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదానికి గురైన కోచ్‌ను పరిశీలిస్తున్న రైల్వే సిబ్బంది కోచ్‌లో పొగ రావడం వల్ల ఆందోళనలో ప్రయాణికులు 'B5 కోచ్‌లో పొగ రావడం చూసిన వెంటనే నేను టీటీఈకి సమాచారం అందించాను. ఇలాంటి సమస్యలు ఉన్న ఈ రైలులో ప్రయాణం చేయడం ఏ మాత్రం సేఫ్ కాదని నాకు అనిపించింది'
-సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికుడు
మరో రైలులో మంటలు..
సీల్దా-అజ్మేర్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం తెల్లవారుజామున మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైలులో ఉన్న ప్రయాణికులు.. రైల్వే అధికారులకు ప్రమాద సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా మీదుగా సీల్దా-అజ్మేర్ ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా రైలులో మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు చెప్పారు.
ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
ఒడిశాలో సోమవారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కోరమాండల్ రైలు ఘోర ప్రమాదం మరువకముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. సున్నపురాయితో వెళ్తున్న గూడ్స్ రైలు బార్గఢ్ వద్ద పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఐదు బోగీలు పట్టాలు తప్పి.. పక్కకు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. న్యారో గేజ్ లైన్‌పై ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు స్పష్టం చేశారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు.
'రైల్వే శాఖకు సంబంధం లేదు'
పట్టాలు తప్పిన గూడ్స్ రైలును ఓ ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీ నడిపిస్తోందని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. మెందపాలి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే రైలు పట్టాలు తప్పిందని వివరించింది. దానితో రైల్వే శాఖకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
రైలుకు పగుళ్లు.. తప్పిన ప్రమాదం!
తమిళనాడులో ఓ రైలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. కొల్లం జంక్షన్- చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీ కింది భాగంలో ఏర్పడిన పగుళ్లను తమిళనాడులోని సెంగోట్టై రైల్వే స్టేషన్‌లో గుర్తించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్లు దక్షిణ రైల్వే అధికారులు పేర్కొన్నారు. పగుళ్లను గుర్తించిన రైల్వే సిబ్బంది ఆ బోగీని తొలగించి మధురైలో ప్రత్యామ్నాయంగా మరో బోగీని జోడించారు. చెన్నై- ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ త్రీ బోగీలో పగుళ్లను క్యారేజ్ వ్యాగన్ సిబ్బంది గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పగుళ్లను గుర్తించిన సిబ్బందిని సత్కరించి.. అవార్డును అందజేయనున్నట్టు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. ఆదివారం జరిగిందీ ఘటన.ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.