Track Restoration Balasore : ఒడిశా రైలు ప్రమాదంలో రైల్వే లైన్‌ను పునరుద్ధరించేందుకు.. ఆగ్నేయ రైల్వేతో పాటు తూర్పు కోస్తా రైల్వే, అధికారమంతా రంగంలోకి దిగింది. సుమారు 1,500 మందికి పైగా కార్మికులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు 48 గంటలుగా నిర్విరామంగా క్షేత్ర స్థాయిలో పనులు చేస్తున్నారు. తొలి రోజు నుంచి తీరిక లేకుండా పనిచేస్తున్న.. సిబ్బంది స్థానంలో పని చేయడానికి వాల్తేరు డివిజన్ నుంచి ఆదివారం 280 మంది సిబ్బందితో.. ప్రత్యేక రైలు బహనాగ బజార్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఒడిశా, బంగాల్ రైల్వే ఉన్నతాధికారులు, వాల్తేరు డీఆర్‌ఎం అనూప్ శత్పథి పునరుద్ధరణ పనులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత డౌన్‌లైన్ పునరుద్ధరించారు. తర్వాత రెండు గంటలకే అప్‌లైన్ కూడా సిద్ధమైంది. ఈ సెక్షన్ నుంచి మూడు రైళ్లను ప్రయోగాత్మకంగా నడిపామని.. మరో ఏడు రైళ్లను పరిశీలించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆదివారం రాత్రి 10.40 గంటలకు సిద్ధమైన మార్గంలో తొలి గూడ్స్ రైలును రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. వైజాగ్ నౌకాశ్రయం నుంచి రవుర్కేలా ఉక్కు కర్మాగారానికి బొగ్గును తీసుకెళ్తున్న రైలును మంత్రి ప్రారంభించారు. బెంగళూరు-హౌవ్‌డా రైలు ప్రమాదానికి గురైన ట్రాక్‌పైనే ఈ గూడ్సు పరుగులు పెట్టింది. తర్వాత వివిధ రైళ్లు బాలేశ్వర్ మార్గంలో తిరుగుతున్నాయి. లూప్‌లైన్ పనులు మాత్రం ఇంకా సాగుతున్నాయి. గూడ్సు సహా ప్యాసింజర్ రైళ్లను కూడా ప్రమాదం జరిగిన మార్గంలో తిప్పుతున్నారు. అయితే ఆ ప్రదేశంలో మాత్రం నెమ్మదిగా నడుపుతున్నారు. అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్‌ను కూడా ప్రమాద స్థలిలో వేగం తగ్గించి నడుపుతున్నారు.
"ప్రధాని మోదీ పునరుద్ధరణ పనులు తొందరగా చేయాలని ఆదేశించారు. మొత్తం సిబ్బంది వేగంగా ట్రాక్‌లను సిద్ధం చేసి రెండు మార్గాలను పునరుద్ధరించారు. భయానక దుర్ఘటన జరిగిన 51 గంటల్లోపే రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి వచ్చాయి."
--అశ్వినీ వైష్ణవ్, రైల్వే మంత్రి