తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Godavari Floods in AP: ముంచెత్తిన గోదారి.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. ప్రభుత్వ సాయం కోసం నిర్వాసితుల నిరీక్షణ - గోదావరి వరదలు

Water Flow to Dhavaleswaram Barrage: భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో పలు పల్లెలు జలదిగ్బంధమయ్యాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముంపు గ్రామాలు భయం గుప్పిట్లో అల్లాడుతున్నాయి. ప్రభుత్వ సాయం కోసం నిర్వాసితులు నిరీక్షిస్తున్నారు.

godavari
godavari

By

Published : Jul 22, 2023, 8:06 AM IST

Today Water Level at Dhavaleswaram Barrage: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. నదీ పరివాహక ప్రాంతంలోని పలు పల్లెలు జలదిగ్బంధమయ్యాయి. శుక్రవారం రాత్రి సమయానికి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 11.70 అడుగుల నీటిమట్టం నమోదవగా..9 లక్షల 73 వేల 870 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఫలితంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా చాకలిపాలెం సమీపంలోని పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక కాజ్‌వే ముంపు బారిన పడింది. దీంతో లంక గ్రామ ప్రజలు పి.గన్నవరం మండలం చాకలిపాలెం వైపు రావడానికి అవస్థలు పడుతున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగితే పల్లపు ప్రాంతాలు నీట మునిగే అవకాశాలు ఉన్నాయి.

కాజ్​వే పై వరద.. ఆరు గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకాలు: గోదావరి ఉద్ధృతితో వశిష్ఠ, వైనతేయ, గౌతమి గోదావరి నదీపాయల్లో వరద జోరు మరింత పెరిగింది. శబరి, గోదావరి నదుల్లో ప్రవాహం పెరిగి గ్రామాల సమీపంలోకి నీరు చేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం శ్రీరామగిరి, చొక్కనపల్లి, వడ్డిగూడెం, చింతరేవుపల్లి, పత్తిపాక, ఏవీగూడెం, ఇప్పూరు, కల్తునూరు, తుమ్మిలేరు, పోచవరం తదితర గ్రామాల ప్రజలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. దేవీపట్నం మండలం కొండ మొదలు పంచాయతీలోని తాళ్లూరు గిరిజనులు పాత గ్రామంలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కూనవరం మండలం కోండ్రాజుపేట కాజ్‌వే పై వరద ప్రవహించడంతో రెండు రోజులుగా ఈ మార్గంలో 6 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. దేవీపట్నం మండలం పోశమ్మ గండి వద్ద శుక్రవారం సాయంత్రానికి రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. దీంతో ఆలయం పూర్తిగా మునిగిపోయింది.

గంటగంటకూ పెరుగుతున్న నీటిమట్టం: శుక్రవారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.80 అడుగుల నీటిమట్టంతో 8 లక్షల 48 వేల 870 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో ఉండగా.. గంటగంటకూ పెరుగుతూ వస్తోంది. ఇక్కడ 10 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. తెలంగాణలోని భద్రాచలం వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 43.90 అడుగుల నీటిమట్టం మధ్యాహ్నం వరకు కొనసాగింది. 12 గంటల నుంచి క్రమేపీ వరద ఉద్ధృతి తగ్గుతూ వస్తోంది. ఇవాళ గోదావరి వరద మరికొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఘాట్లలోకి ఎవరినీ వెళ్లకుండా జలవనరుల శాఖ అధికారులు, పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details