బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఇచ్చేందుకు మమతా బెనర్జీ సుముఖంగా లేరని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వివిధ ప్రాంతాల్లో మంచి పేరున్న యువకులు, మహిళలకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే దీనిపై మమత నియమించిన 12 మంది సభ్యుల ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. ఎన్నికల కమిటీతో సోమవారం జరిగిన సమావేశంలో అభ్యర్థుల జాబితాను త్వరగా పూర్తి చేయాలని నాయకులకు దీదీ దిశానిర్దేశం చేశారని టీఎంసీ నేతలు తెలిపారు.
ఐ-ప్యాక్కే బాధ్యతలు..
బంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 30 శాతం కొత్త అభ్యర్థులను తీసుకునేందుకు టీఎంసీ ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తోంది. వీరితో పాటు 19 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరడంతో ఏర్పడిన ఖాళీ స్థానాల్లోనూ కొత్తవారినే నిలపాలని మమత ఆదేశించినట్లు సమాచారం. కొత్త అభ్యర్థుల ఎంపికలో రాజకీయ విధాన కర్త ఐ-ప్యాక్ అధినేత ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
పనితీరే ప్రామాణికం..
గత ఐదేళ్లలో బంగాల్‌లోని ఆయా నియోజకవర్గల్లో ఎమ్మెల్యేల పనితీరు, వారి పట్ల ప్రజాభిమానాన్ని ప్రమాణంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. అలాగే పార్టీలో 75 ఏళ్లు నిండినవారికి కూడా ఈసారి టిక్కెట్ నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. గత ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించగా ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలు కేటాయించాలని ఎన్నికల కమిటీని మమత ఆదేశించారు.