పెళ్లైన మహిళపై ప్రేమ లేఖ విసరడం తప్పని బొంబయి హైకోర్టు తేల్చి చెప్పింది. ఇలా చేయడం ఆమె నిబద్ధతను శంకించడమేనని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వివాహితకు ప్రేమ లేఖ పంపిన వ్యక్తికి రూ.90వేలు జరిమానా విధించింది. అందులో రూ.85వేలు బాధిత మహిళకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
ఈ కేసు తీర్పు సందర్భంగా మహిళకు పాతివ్రత్యమే అత్యంత విలువైన ఆభరణమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాహితను ప్రేమించాలని ప్రేరేపించేలా చిట్టీ విసరడం అంటే ఆమెను అవమానించడమేనని స్పష్టం చేసింది.
ఏం జరిగిందంటే..
2011 అక్టోబరు 3న ఓ కిరాణా షాపు యజమాని అక్కడ పనిచేసే వివాహితకు ప్రేమ లేఖ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆమెకు అందుకు తిరస్కరించడం వల్ల 'ఐ లవ్ యూ' అంటూ ఆ చిట్టీని ఆమెపై విసిరి వెళ్లాడు. ఆ మరునాడు మళ్లీ పిచ్చి చేష్టలతో ఆమెను విసిగించాడు. ప్రేమ లేఖ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. అకోలాలోని సివిల్లైన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దర్యాప్తు అనంతరం అతడిపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 354, 506, 509 కింద కేసు నమోదు చేశారు. 2018 జూన్ 21న సెషన్స్ కోర్టు నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 40 వేలు జరిమానా విధించింది.
అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు. మహిళ తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని, తన షాపులో సరకులు తీసుకొని డబ్బులు చెల్లించలేదని చెప్పాడు. అవి అడిగనందుకే తనపై అభియోగాలు మోపిందని ఆరోపించాడు. వాదనలు విన్న ధర్మాసనం వీటిని తోసిపుచ్చింది. ఆధారాలు పక్కాగా ఉన్నాయని సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే అతడు ఇప్పటికే 45 రోజులు జైలు శిక్ష అనుభవించినందున శిక్షను ఏడాదికి తగ్గించింది. జరిమానాను మాత్రం రూ.90వేలకు పెంచింది.
ఇదీ చూడండి:గాంధీలు లేకుండా విపక్ష నేతలకు సిబల్ విందు- దేనికి సంకేతం?