బిహార్‌లోని గయా జిల్లాలో ఫిరంగి గుండు ఇంట్లోకి దూసుకొచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. సైనిక విన్యాసాల రిహార్సల్స్‌లో భాగంగా ఈ ఫిరంగి గుండును ప్రయోగించారు. బరాచట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని గులార్ బెడ్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగిందీ దుర్ఘటన.
హోలీ ఆడుతుండగా..
బుధవారం ఉదయం సైనికుల విన్యాసాల్లో భాగంగా ఉపయోగించే ఫిరంగిలో నుంచి ఓ గుండు ప్రమాదవశాత్తు గ్రామంలోని గోవింద్ మాంఝీ అనే వ్యక్తి నివాసంపై పడింది. అదే సమయంలో హోలీ వేడుకలు జరుపుకుంటున్న గోవింద్ కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మిగతా ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
మృతుల్లో గోవింద్ అతడి కుమార్తె కంచన్‌తో పాటు అల్లుడు సూరజ్ కుమార్ ఉన్నట్లు సమాచారం. గీతా కుమారి, పింటు మాంఝీ, రసో దేవితో పాటు మరో ముగ్గురు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరు మగధ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, బుధవారం ఉదయం కుటుంబ సభ్యులంతా కలిసి హోలీ పండుగ జరుపుకొంటున్న సమయంలో ఈ విషాదం జరిగింది. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్థులు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని ఆరోపిస్తూ నిరసనకు దిగారు.