Four Family Members Suspicious Death In Nuh : హరియాణా.. నూహ్ జిల్లాలో ఓ వ్యక్తి, అతడి ముగ్గురు పిల్లలు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అయితే వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా, మృతి చెందిన వ్యక్తి భార్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మరణాలకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజ్‌కమేవ్ పోలీస్‌స్టేషన్ గంగోలీ గ్రామంలో జీతన్ (38) అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. జీతన్, అతడి ముగ్గురు పిల్లలు ఇంట్లో అనుమానాస్పద రీతిలో చనిపోయారు. అయితే ఆ తర్వాత నుంచి జీతన్ భార్య కనిపించడం లేదు. ఆ మహిళనే తన భర్త, పిల్లలకు విషం ఇచ్చిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం నూహ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్- సీహెచ్‌సీకి తరలించారు.
ఈ ఘటనపై నూహ్ డీఎస్పీ జితేంద్ర కుమార్ రాణా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందలేదని తెలిపారు. శవ పరీక్ష నివేదిక వస్తే మృతికి గల కారణాలు వెల్లడవుతాయని చెప్పారు. దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జితేంద్ర కుమార్ స్పష్టం చేశారు.