హరియాణా కర్నాల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్నాల్ మినీ సెక్రటేరియట్‌ను చుట్టుముట్టేందుకు వేలాది మంది రైతులు జిల్లా ప్రధాన కార్యాలయానికి తరలివెళ్లారు. హింసాత్మక ఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో పోలీసులను భారీస్థాయిలో మోహరించారు అధికారులు.
లాఠీఛార్జ్‌కు నిరసనగా..
ఆగస్టు 28న కర్నాల్ ప్రాంతంలో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని రైతు సంఘాలు అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం న్యూ అనాజ్ మండీ వద్ద మహాపంచాయత్ నిర్వహించగా.. సభకు పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వేలాది మంది రైతులు తరలివెళ్లారు.