లక్ష్మీ నివాస్, ఆనంది నిలయం, ప్రశాంతి నిలయం ఇలా.. హరియాణా నూహ్ జిల్లాలోని కిరూరి గ్రామంలో ప్రతీ ఇంటి ఎదుట తమ కూతురి పేర్లతో కూడిన బోర్డులు కనిపిస్తాయి. లింగ నిష్పత్తిలో భారీ అంతరం ఉన్న ఈ ప్రాంతంలో.. ప్రగతిశీల ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమానికి నడుం కట్టారు ఇక్కడి ప్రజలు. 250 కుటుంబాలు, 1250 జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రతి ఇంటి ముందూ తమ కూతుళ్ల పేరుతో ఓ బోర్డు ఏర్పాటై ఉంది.
ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఇదే తొలిసారి కాకపోయినా.. ఇంతటి భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహించడం మాత్రం దేశంలో ఇదే మొదటిసారి.
మోదీ ప్రేరణతో!
లాడో స్వాభిమాన్(కుమార్తెల ఆత్మగౌరవ పండుగ) సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వామిత్వ యోజన నుంచి ప్రేరణ పొందిన మాజీ సర్పంచ్ సునీల్ జాగ్లాన్.. ఈ అరుదైన కసరత్తుకు ఆద్యుడయ్యారు. తన కూతురితో కలిసి దిగిన సెల్ఫీతో ప్రధాని మోదీ అభినందనలు అందుకున్నారు జాగ్లాన్.
"స్వామిత్వ పథకంలో భాగంగా ప్రధాని మోదీ యాజమాన్య కార్డులను పంచినప్పుడు మన కూతుళ్లకు కూడా ఓ గుర్తింపు ఉండాలని భావించాను. తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఉందన్న విషయాన్ని సమాజం పెద్దగా పరిగణనలోకి తీసుకోదు. కుమార్తె పేరు ద్వారా తండ్రి తన ఇంటికి గుర్తింపు ఇస్తే, సమాజంలోని ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చవచ్చు."