Third Covid Wave in India: కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌తో చాలా దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి మరోసారి పెరుగుతోంది. కొన్ని చోట్ల మూడు, మరికొన్ని దేశాల్లో నాలుగో వేవ్ రూపంలో ప్రభావాన్ని చూపుతోంది. ఇదే సమయంలో భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మనదేశంలో ఫిబ్రవరి తొలివారానికి మూడో వేవ్ గరిష్ఠానికి చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌తో పెరుగుతోన్న తీవ్రతను పరిగణనలోకి తీసుకొని భారత్‌లో ఈ అంచనాలను రూపొందించినట్లు తెలిపింది.
దేశంలో థర్డ్‌వేవ్‌ను అంచనా వేసేందుకు గసియన్ మిశ్రమ మోడల్ అనే గణాంక పద్ధతి ద్వారా ఐఐటీ కాన్పూర్ నిపుణులు ఓ అంచనా వేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే థర్డ్‌వేవ్ ప్రభావాన్ని చవిచూస్తోన్న అమెరికా, బ్రిటన్, జర్మనీతోపాటు రష్యా దేశాల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొన్నారు. వీటితోపాటు భారత్‌లో తొలి, రెండోవేవ్ సమయంలో నమోదైన కేసుల సంఖ్యనూ వినియోగించారు. వీటిని క్రోడీకరించిన నిపుణులు.. 2022 ఫిబ్రవరి తొలివారం నాటికి దేశంలో థర్డ్‌వేవ్ గరిష్ఠానికి చేరుకోవచ్చని అంచనా వేశారు. అయితే, వ్యాక్సినేషన్‌ను పరిగణనలోకి తీసుకోనందున ఆ సమయం నాటికి ఎన్ని కేసులు వస్తాయనే విషయాన్ని మాత్రం అంచనా వేయలేదని స్పష్టం చేశారు.
Omicron Cases in India:
డిసెంబర్ 15, 2021 నుంచి కేసులు పెరుగుతాయని.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నాటికి గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కొవిడ్ పోకడలను అనుసరించి భారత్‌లో థర్డ్ వేవ్‌పై అంచనాలు కట్టామని అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులు పేర్కొన్నారు. సమీక్ష కోసం ఓ జర్నల్‌లో ఉంచిన ఈ అధ్యయనానికి ఐఐటీ కాన్పూర్‌లోని మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్ విభాగానికి చెందిన సరాబా పర్షాద్ రాజేశ్‌భాయ్, సుభ్రాశంకర్ ధర్, శలభ్‌లు ఈ అధ్యయనం చేపట్టారు.