State Government Approached Supreme Court on Pending Bills: రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖలు చేయగా.. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చారు. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని అందులో ప్రభుత్వం పేర్కొంది.
గత సెప్టెంబర్ 14 నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని అన్నారు. ఆర్థికపరమైన బిల్లు కాకపోతే మళ్లీ పరిశీలించాలని చట్ట సభలను కోరవచ్చని తెలిపారు. 163వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్.. ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు విధులు నిర్వర్తించాలి తప్ప.. స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదని.. షంషీర్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని గుర్తు చేశారు. మంత్రిమండలి సలహాకు విరుద్ధంగా గవర్నర్ వ్యవహరించి సమాంతర పాలనకు అవకాశం లేదని కూడా వ్యాఖ్యానించినట్లు గుర్తు చేశారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బిల్లులకు ఆమోదం తెలపకుండా ఉండటం, ఆలస్యం చేయడానికి గవర్నర్‌కు ఎలాంటి విచక్షణాధికారాలు లేవని తిరస్కరించడం, ఆలస్యం చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రజల ఆకాంక్షను దెబ్బతీస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో వ్యాఖ్యానించింది. విషయ ప్రాధాన్యత, తీవ్రత దృష్ట్యా ఇతర అవకాశాలు ఏవీ లేక సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్, రాజ్యాంగ సభ చర్చలు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పిటిషన్‌లో ప్రస్తావించారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీనియర్ అధికారులతో గవర్నర్‌ను కలిసి విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుల ఆవశ్యకత, ప్రాధాన్యతను వివరించడంతో పాటు సందేహాలను నివృత్తి చేశారని పేర్కొన్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం బిల్లులకు త్వరగా ఆమోదముద్ర వేయాలని కోరినట్లు చెప్పారు. త్వరలోనే బిల్లులను ఆమోదిస్తానని మంత్రులకు గవర్నర్ హామీ ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు. ఇంతకాలం బిల్లులను పెండింగ్‌లో పెట్టేందుకు ఎలాంటి సహేతుక కారణాలు కూడా లేవని అన్నారు. బడ్జెట్ విషయంలోనూ మొదట గవర్నర్ అనుమతించకపోతే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, న్యాయస్థానం సూచన మేరకు అనుమతించారని ప్రస్తావించారు. పెండింగ్ బిల్లులను కూడా ఆమోదిస్తారని గవర్నర్ తరఫు న్యాయవాది అప్పుడు చెప్పినట్లు గుర్తు చేశారు.
ఇంత సమయం గడిచినప్పటికీ బిల్లులకు ఆమోదం లభించలేదని, దీంతో విధి లేకే ప్రత్యేక పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో పెట్టడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించాల్సిందేనని తెలిపింది. ఇంకా ఆలస్యం చేయడం వల్ల మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, పాలనపై ప్రభావం పడుతుందని, ప్రజలకు ఇక్కట్లు ఎదురవుతాయని పేర్కొంది. తక్షణమే బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
ఇవీ పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివరాలు..
1.తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
2. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు
3. అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు