తమిళనాడులో పొత్తుల విషయంపై మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు సినిమా లెవెల్ డైలాగ్‌తో సమాధానం ఇచ్చారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనకు మంచి స్నేహితుడని చెప్పిన కమల్ హాసన్.. ఆయనతో బంధం రాజకీయాలకు అతీతమని తెలిపారు. మార్చి 1న స్టాలిన్ పుట్టిన రోజు నేపథ్యంలో మంగళవారం చెన్నైలో ఆయన ఫొటో గ్యాలరీని ప్రారంభించారు కమల్ హాసన్. రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు, చెన్నై మేయర్ ఆర్ ప్రియ ఆహ్వానం మేరకు కమల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ఏ పార్టీలతో కలిసి పోటీ చేస్తామనే విషయంపై ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
"గొప్ప రాజకీయ నేతకు పుట్టిన కుమారుడు ఎంకే స్టాలిన్. కలైంజ్ఞర్ (కరుణానిధి) సినీ పరిశ్రమలో ఉన్నప్పటి నుంచి స్టాలిన్ నాకు తెలుసు. అన్ని సవాళ్లు ఎదుర్కొంటూ క్రమక్రమంగా ఆయన ఈ స్థాయికి వచ్చారు. డీఎంకే కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి యూత్ సెక్రెటరీగా, ఎమ్మెల్యేగా, మేయర్‌గా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఇప్పుడు డీఎంకే అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్టాలిన్, నేను క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోవచ్చు. కానీ మేం స్నేహితులం అనే విషయం అందరికీ తెలిసిందే. మా స్నేహం రాజకీయాలకు అతీతం. ఆయన పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఏ విషయమైనా వెంటనే మనం క్లైమాక్స్‌కు వెళ్లిపోకూడదు. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ అన్నట్టు వెళ్తూ ఉండాలి. అలా వెళ్తేనే కథ కొనసాగుతుంది."
-కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు