కొవాగ్జిన్ టీకా(covaxin vaccine) తీసుకుంటే, కొవిడ్-19 నుంచి 77.8 శాతం రక్షణ లభిస్తోందని ప్రముఖ మెడికల్ జర్నల్ 'ద లాన్సెట్' పేర్కొంది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) కలిసి అభివృద్ధి చేసిన ఈ టీకాతో తీవ్ర దుష్ఫలితాలు (సైడ్ ఎఫెక్ట్స్) కనిపించలేదని వివరించింది. కొవాగ్జిన్(covaxin news) నిర్వహించిన 3వ దశ క్లినికల్ పరీక్షల ఫలితాలపై, మధ్యంతర విశ్లేషణలో తేలిన అంశాలతో ఒక వ్యాసాన్ని ఈ పత్రిక ప్రచురించింది. టీకా(Corona vaccine) తీసుకున్న వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు 3వ దశ క్లినికల్ పరీక్షల్లో నిర్థరణ అయిందని, అదే సమయంలో తీవ్ర సైడ్ ఎఫెక్ట్‌లు, మరణాలు నమోదు కాలేదని అందులో తెలిపింది. తలనొప్పి, అలసట, టీకా ఇచ్చిన చోట నొప్పి.. వంటి చిన్న చిన్న ఇబ్బందులే కనిపించినట్లు వివరించింది. టీకాను 28 రోజుల వ్యవధిలో రెండు డోసులుగా ఇస్తున్న విషయం విదితమే.
నిర్థరణ ఇలా
కొవాగ్జిన్ టీకాపై(covaxin clinical trials) 3వ దశ క్లినికల్ పరీక్షలను గత ఏడాది నవంబరు 16 నుంచి ఈ ఏడాది మే 17వ తేదీ మధ్యకాలంలో నిర్వహించారు. భిన్నత్వం కోసం దేశవ్యాప్తంగా 25 ప్రదేశాల్లోని ఆసుపత్రుల్లో వీటిని చేపట్టారు. టీకా ఇచ్చిన 8,471 మందిలో 24 మందికి కొవిడ్-19 పాజిటివ్ రాగా, 'ప్లాసిబో' గ్రూపులోని 8,502 మందిలో 106 మందికి కరోనా సోకింది. ఈ క్రమంలో టీకాతో 77.8 శాతం రక్షణ ఉన్నట్లు నిర్థారణకు వచ్చారు.
- కరోనా వైరస్‌కు సంబంధించి డెల్టా(Delta variant), ఇతర రకాలపై(వేరియంట్స్) ఈ టీకా ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోడానికి మరింత లోతైన పరిశోధన చేపట్టాల్సి ఉందని వ్యాస రచయితలు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రధానంగా భారతీయుల మీద క్లినికల్ పరీక్షలు నిర్వహించినట్లు, ఇతర దేశాల ప్రజలు/జాతీయుల మీద దీని ప్రభావం ఎలా ఉంటుందనే అధ్యయనం చేపట్టాల్సి ఉన్నట్లు వివరించారు.
15 కోట్ల డోసుల పంపిణీ
కొవాగ్జిన్ టీకాకు(covaxin news) ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర వినియోగ గుర్తింపు(ఈయూఎల్) ఇచ్చిన విషయం విదితమే. ఇప్పటి వరకు 15 కోట్ల డోసుల టీకాను ఉత్పత్తి చేసి, పంపిణీ చేశారు. ఈ వ్యాక్సిన్ ప్రభావం 2-18 ఏళ్ల పిల్లలపై ఎలా ఉందనే విశ్లేషణ ప్రస్తుతం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫలితాలు వచ్చే ఏడాది ప్రారంభంలో వెల్లడి కావచ్చు. ఏటా 100 కోట్ల డోసుల టీకాను ఉత్పత్తి చేయాలని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.