Indian economy Growth: మహమ్మారి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మిగతా ప్రపంచ దేశాల కంటే కిందికి పడిపోయినప్పటికీ అంతే వేగంగా పైకి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, ఐరోపా దేశాల కంటే మన ఆర్థిక వృద్ధి వేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు. 2022-23 బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చకు ఆమె గురువారం రాత్రి సుమారు రెండు గంటల పాటు సమాధానం ఇచ్చారు.
"స్వాతంత్య్రానంతరం దేశంలో నాలుగుసార్లు జీడీపీ వృద్ధిరేటు మందగించింది. 1973-74లో ప్రపంచ చమురు సంక్షోభంతో, 1979-80లో ఇరాన్-ఇరాక్ యుద్ధం వల్ల, 2008-09లో ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల జీడీపీ వృద్ధిరేటు తగ్గింది. అంతేగానీ ఎన్నడూ నెగెటివ్‌లోకి వెళ్లలేదు. కొవిడ్ సంక్షోభం కారణంగా 2020-21లో జీడీపీ వృద్ధిరేటు మైనస్ 6.6% మేర పడిపోయింది. ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. 2008-09లో ఆర్థిక మందగమనం వల్ల జీడీపీ తగ్గుదలతో రూ.2.12 లక్షల కోట్లు కోల్పోతే.. 2020-21లో రూ.9.7 లక్షల కోట్ల విలువైన జీడీపీని కోల్పోవాల్సి వచ్చింది. వినియోగదారుల ధరల సూచీ మాత్రం 6.2%కే పరిమితమయ్యేలా చూశాం. అత్యధిక ఆర్థిక పతనంలోనూ ధరల భారం సామాన్యుడిపై పడకుండా కాపాడాం. మా ఆర్థిక నిర్వహణను అందరూ సానుకూల కోణంలో చూడాలి. 2008-09లో విదేశీ మారకద్రవ్య నిల్వలు 252 బిలియన్ డాలర్లు ఉంటే ఇప్పుడు 579 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎఫ్‌డీఐలు పదింతలు పెరిగాయి."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి.