Global Investors Summit : విశాఖలోని ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభమైంది. అడ్వాంటేజ్ ఏపీ నినాదంతో 14 రంగాల్లో సదస్సు నిర్వహిస్తుండగా.. పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు సహా వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, సైయంట్ అధినేత మోహన్‌రెడ్డి, అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ తదితర ప్రముఖులు ఉన్నారు.
పెట్టుబడి దారుల సదస్సు సందర్భంగా ఏపీలో పారిశ్రామిక వనరులపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆయా రంగాల్లో అందుబాటులో ఉన్న వనరులు, రవాణా సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై డాక్యుమెంటరీ ప్రదర్శించింది.
పరిశ్రమల స్థాపనకు ఏపీ అనుకూలం..రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, అందుకు విశాఖలో జరుగుతున్న పారిశ్రామిక వేత్తల సదస్సు వేదిక కానుందని సీఎం జగన్ అన్నారు. 340 సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయని, 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. సదస్సు మొదటి రోజు 92 ఏంవోయూలు కుదుర్చుకున్నట్లు సీఎం వెల్లడించారు. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందని, రాష్ట్రంలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయని, 6 పోర్టులకు తోడు అదనంగా మరో 4 పోర్టులు రాబోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు.. పరిశ్రమల స్థాపనకు ఏపీలో భౌగోళికంగా అనుకూల వాతావరణం ఉందన్నారు.
సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అవకాశాలు అపారం అని చెప్పారు. పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ముందుందని తెలిపారు.
సత్వర అనుమతులు..పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే అనుమతులు అందజేయనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అపార ఖనిజ సంపద, పెట్టుబడులకు అపరిమిత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సీఎం జగన్ నాయకత్వంలో అంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ జగన్ పాలన సాగుతోందని చెప్పుకొచ్చారు.