కేరళలోని పాలక్కడ్ జిల్లా పయంబలక్కోడు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆన్లైన్ ఆటో-రిక్షా వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆటో డ్రైవర్లు సహా.. ఆటో స్టాండు మొత్తాన్ని డిజిటల్ విధానంలో రూపొందించారు. ఐపీపీబీ ప్రయత్నాన్ని.. చొరవను కేంద్ర ఐటీ పరిశ్రమల మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రశంసించారు. దేశంలో డిజిటల్ విధానం మరింత విస్తరిస్తోందన్నారు.
డాక్-పే..
ఈ-ఆటోల్లో ప్రయాణించే వారు ఏదైనా యూపీఐ యాప్ సాయంతో డాక్-పే క్యూఆర్ కోడ్ ఉపయోగించి సులువుగా చెల్లింపులు చేయవచ్చని పోస్టల్ అధికారులు చెబుతున్నారు. ఆ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ప్రాజెక్టు.. ఆటో డ్రైవర్లకు వెసులుబాటుగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రయాణికులు ఐపీపీబీ యాప్ను కలిగి ఉంటారని.. వీరంతా నేరుగా పోస్టల్ బ్యాంకు ఖాతా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా నిమిషాల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.