కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోళి ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. బాధితురాలి తరపున కమిషనరేట్ కార్యాలయంలో కార్యకర్త దినేశ్ కల్లహళ్లి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసును కబ్బన్ పార్క్ ఠాణాకు బదిలీ చేశారు.
"ఇది చాలా సున్నితమైన అంశం. బాధితురాలి వివరాలను నేను వెల్లడించలేను. ఈ విషయంపై ఆమె కుటుంబసభ్యులు నన్ను సంప్రదించారు. తమకు పోరాడేందుకు స్తోమత లేదని, నా సహాయం కోరారు. ఇందుకు సంబంధించిన సీడీ నిన్న నాకు అందించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ మంత్రి బాధితురాలిని లైంగికంగా వేధించారు. బాధితురాలు న్యాయం చేయమని అడిగింది."
-దినేశ్ కల్లహళ్లి, సామాజిక కార్యకర్త
ఫిర్యాదులో ఏముంది ?
బెంగళూరులోని ఆర్టీ నగర్లో నివసిస్తున్న బాధితురాలిని ఓ లఘు చిత్రం నిర్మిస్తున్న సమయంలో విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మంత్రి ఆమెను లైంగికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై తన వద్ద ఆధారంగా సీడీ ఉందని చెప్పిన బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.