తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనాపై పోరు ఉద్ధృతం.. టెస్టింగే కీలకం'

దేశంలో కరోనా కట్టడికి ఈ నెల 11 నుంచి 14 వరకు 'టీకా ఉత్సవ్'‌ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై గురువారం సీఎంలతో సమీక్ష జరిపారు. రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి.. అందరి సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. రాత్రిపూట విధించే కర్ఫ్యూలకు 'కరోనా కర్ఫ్యూ'గా నామకరణం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.

modi, pm modi
మోదీ, నరేంద్ర మోదీ

By

Published : Apr 9, 2021, 5:09 AM IST

కరోనా కట్టడికి పోరును ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్యాన్ని వీడి యుద్ధ ప్రాతిపదికన గట్టి చర్యలు చేపడితే కొవిడ్ నియంత్రణ పెద్ద పనేమీకాదన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫనెర్స్​ ద్వారా మాట్లాడిన మోదీ.. కొన్ని రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు. మొదటిసారి కంటే ఇప్పుడు కేసుల వృద్ధిరేటు చాలా వేగంగా ఉందన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈసారి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. రాత్రి కర్ఫ్యూలకు కరోనా కర్ఫ్యూలుగా పిలవాలన్నారు. ఈనెల 11-14 తేదీల మధ్య వ్యాక్సిన్ ఉత్సవం నిర్వహించి, అర్హులందరికీ టీకాలు అందించాలన్న మోదీ... టీకా వృథాను అరికట్టాలని సూచించారు.

ఇంతకు ముందుతో పోలిస్తే ప్రస్తుతం మనకు అనుభవం ఉంది. గతంలో కంటే మంచి వనరులు ఉన్నాయి. వీటితో పాటు వ్యాక్సిన్‌ కూడా మనకు అందుబాటులో ఉంది. మైక్రో కంటెయిన్‌మెంట్‌ జోన్‌ల ఏర్పాటుపై మనం దృష్టి కేంద్రీకరించాలి. రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న ప్రాంతాల్లో.. దాన్ని కరోనా కర్ఫ్యూగా పిలవాలి. దీంతో కరోనాపై అప్రమత్తత పెరుగుతుంది. 72 గంటల్లో 30 మంది కాంటాక్ట్‌లను గుర్తించడమే లక్ష్యంగా పనిచేయాలి. ఏప్రిల్‌ 11 జ్యోతిబాఫూలే జయంతి. ఏప్రిల్‌ 14 బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి. ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు అన్ని రాష్ట్రాల్లో టీకా ఉత్సవాన్ని జరపాలి.

- ప్రధాని నరేంద్ర మోదీ.

అఖిల పక్ష సమావేశాలు..

గవర్నర్, ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్రాల్లో అఖిల పక్ష సమావేశాలను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రధాని సూచనలు చేశారు. ప్రతి రాష్ట్రంలో పాజిటివ్ రేటు 5 శాతం దిగువకు తెచ్చేలా ముమ్మరంగా పరీక్షలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. పరీక్షించడం, గుర్తించడం, చికిత్స అందించడంతో పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడాలని సూచించారు. టెస్టింగ్‌ వల్ల కేసుల సంఖ్య పెరిగినా ఫర్వాలేదన్న ప్రధాని..... కేసులు వచ్చినప్పుడే ఏం చేయాలన్నది తెలుస్తుందన్నారు. 70% ఆర్టీపీసీఆర్ పరీక్షలే చేపట్టాలని పేర్కొన్నారు. అవసరమైతే ల్యాబ్‌లను షిప్టులవారీగా నిర్వహించాలని చెప్పారు.

మరణాలను లోతుగా విశ్లేషించాలి...

  • మరణాలను కనిష్ఠ స్థాయిలో ఉంచేందుకు ప్రయత్నించాలి. ఏస్థాయిలో వైరస్‌ సోకింది? ఆసుపత్రిలో ఎప్పుడు చేరారు? ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా? అన్న వివరాలను లోతుగా విశ్లేషించాలి. దిల్లీ ఎయిమ్స్‌ మంగళ, శుక్రవారాల్లో వెబినార్‌ నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల ఆసుపత్రులూ దాంతో అనుసంధానమై చికిత్స ప్రొటోకాల్స్‌ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
  • అంబులెన్సులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ లభ్యతపై నిరంతరం సమీక్షించాలి.
  • ఒకేరోజు 40 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశాం. ప్రపంచ దేశాల్లో అనుసరిస్తున్న ప్రొటోకాల్‌నే మనమూ అనుసరిస్తున్నాం. కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధి, ప్రస్తుత టీకాల తయారీ పెంపునకు కసరత్తు చేస్తున్నాం. టీకాలను వృథా కానివ్వొద్దు.
  • ఎక్కువ కేసులున్న జిల్లాల్లో 45 ఏళ్లు దాటిన వారందరికీ 100% వ్యాక్సిన్‌ అందించాలి.
  • మాస్కులు ధరించడం, సురక్షిత దూరం పాటించడం వంటి జాగ్రత్తలను యువత పాటిస్తే... వారి దగ్గరకు కరోనా రాదు. కేసుల సంఖ్య కూడా తగ్గుతుంది. డిజిటల్‌ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజలకు టీకా అందిస్తోంది. దాన్ని ఉపయోగించుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారికి యువత సాయం అందించాలి. నగరాల్లోని పేదలు, వృద్ధులు, మురికివాడల వారిని వ్యాక్సిన్లు వేసేచోటుకు తీసుకురావాలి. ఇది పుణ్యకార్యం. టీకా వేయించుకున్న తర్వాత కూడా మాస్కు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. సమాజాన్ని జాగృతపరిచేందుకు ప్రముఖులు, సెలబ్రిటీలు, మతపెద్దల సేవలను ఉపయోగించుకోవాలి.

ఇదీ చూడండి:ఒకే ఆసుపత్రిలో 37 మంది వైద్యులకు కరోనా

ABOUT THE AUTHOR

...view details