Tension at Chandrababu Yerragondapalem TOUR: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు వాహనంపై.. మంత్రి ఆదిమూలపు సురేశ్ క్యాంపు కార్యాలయం వద్ద వైకాపా నాయకులు, కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీనిపై తీవ్రంగా ఆందోళన చెందిన ఎన్ఎస్జి కమెండోలు.. చంద్రబాబుపై రాళ్లు పడకుండా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డు పెట్టారు. ఈ ఘటనలో రాయి పడి కాన్వాయ్‌లోని ఓ వాహనంలో ఉన్న కార్యకర్తకు గాయమైంది. వైకాపా నాయకులు రాళ్లు విసరడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, మా జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. రాళ్లు విసిరిన ఘటనపై నిరసన వ్యక్తంచేస్తున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను ఈ సందర్భంగా పోలీసులు పక్కకు తోసేశారు. పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్యే చంద్రబాబు కాన్వాయ్ అక్కడి నుంచి ముందుకు సాగిపోయింది.
చంద్రబాబు రావడానికి ముందు యర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామంటూ మంత్రి సురేశ్ ఆధ్వర్యాన వైకాపా నాయకులు, కార్యకర్తలు రోడ్డుమీదికి వచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. మంత్రి సురేశ్ కార్యాలయం వద్ద వైకాపా కార్యకర్తలు గుమికూడారు. ఇంకోవైపు అధినేతకు స్వాగతం పలికేందుకు మన్నె రవీంద్ర నాయకత్వంలో భారీగా తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.. మంత్రి సురేశ్‌తో పాటు వైకాపా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల వారు పోటాపోటీ నినాదాలు చేశారు. పోలీసులు తమను నిలువరించడంపై తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళుతుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక కవ్వింపులకు దిగిన మంత్రి సురేశ్ ను.. కొద్దిసేపటి తర్వాత ఆయన క్యాంపు కార్యాలయంలో పోలీసులు పంపించివేశారు. ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలుసుకున్న ఎన్ఎస్జి.. యర్రగొండపాలెంకు అదనపు బలగాలను పంపించింది.