తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'KCR రమ్మన్నారు.. నో చెప్పా.. అప్పుడు ఆయన ఏం రిక్వెస్ట్ చేశారంటే..' - నితీష్ కుమార్ తెలంగాణ సభ

తెలంగాణ సెక్రెటేరియట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ తనను ఆహ్వానించినట్లు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ వెల్లడించారు. అయితే, ఇందుకు తాను నో చెప్పినట్లు తెలిపారు.

telangana secretariat opening kcr-nitish
telangana secretariat opening kcr-nitish

By

Published : Jan 29, 2023, 7:19 PM IST

తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారని బిహార్ సీఎం నీతీశ్ కుమార్ తెలిపారు. తన బదులు బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జనతా దళ్(యునైటెడ్) అధ్యక్షుడు లలన్ సింగ్​ను ఆ కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా తాను కోరానని తెలిపారు.

"కార్యక్రమానికి రావాలని ఆయన (కేసీఆర్) కోరారు. కానీ ఇక్కడ చాలా పనులు ఉన్నాయని ఆయనకు చెప్పా. పార్టీ నుంచి ఎవరినైనా పంపించాలని ఆయన అడిగారు. లలన్​ను వెళ్లమని చెప్పా. తేజస్వికి సైతం ఈ విషయం చెప్పమని కేసీఆర్ అడిగారు. 'నేనైతే చెప్తా కానీ మీరు కూడా వారితో మాట్లాడండి' అని సూచించా. వారిద్దరూ (లలన్, తేజస్వి) హైదరాబాద్ వెళ్తున్నారు."
-నీతీశ్ కుమార్, బిహార్ సీఎం

హైదరాబాద్​లో కేసీఆర్ సభకు వెళ్లినంత మాత్రాన.. కాంగ్రెస్​తో తమ భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదని నీతీశ్ స్పష్టం చేశారు. భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్​తో కలిసి విపక్షాలను ఏకం చేయాలని తాను చేస్తున్న ప్రయత్నాలను విరమించలేదని తెలిపారు. "నేను ఇదివరకు కూడా చెప్పాను. ఆ ఆలోచనను నేను పక్కన పెట్టలేదు. భారత్ జోడో యాత్ర పూర్తవ్వాలని నేను వేచి చూస్తున్నా. ఆ తర్వాత అన్ని పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటాం. వీలైనంత మందిని కలుపుకొని వెళ్లే కూటమిని ఏర్పాటు చేయడంపై చర్చిస్తాం. భాజపా నుంచి విడిపోయన తర్వాత వివిధ పార్టీలతో చర్చలు జరిపి ఈ (విపక్షాల ఐక్యత) విషయంలో నా వంతు ప్రయత్నాలు చేశా" అని నీతీశ్ కుమార్ పేర్కొన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్.. విపక్ష నేతలతో కలిసి ఇదివరకే ఓ భారీ సభ నిర్వహించారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు.. ముగ్గురు సీఎంలు, ఓ మాజీ సీఎం, కమ్యూనిస్టు నేతలు హాజరయ్యారు. తాజాగా ఆయన మరో బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫిబ్రవరి 17న తెలంగాణ సెక్రెటేరియట్​ను ప్రారంభించిన అనంతరం ఈ సభ ఉండనుంది. ఖమ్మం సభకు నీతీశ్ కుమార్ రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సభకు తనను ఎవరూ పిలవలేదని, పిలిచినా వచ్చి ఉండేవాడిని కాదని నీతీశ్ వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details