KTR on Vizag Steel Plant Privatization : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం లేదన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన కేవలం దృష్టి మరల్చేందుకేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. అదానీకి బైలడిల్లా గనుల కేటాయింపు కుట్రను బీఆర్ఎస్ బయటపెట్టిందన్న ఆయన.. ఈ అంశంపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కొత్త డ్రామాకు కేంద్రం తెరతీసిందని విమర్శించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. విశాఖ ఉక్కు పరిశ్రమకు క్యాప్టివ్ ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని మంత్రి కేటీఆర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఆ ఒక్క ప్రకటనతో కేంద్రం వెనక్కి తగ్గింది : అదానీకి బైలదిల్లా ఇనుప ఖనిజ గనుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత వైఖరిని బయటపెట్టినందుకే కేంద్రం కొత్త నాటకానికి తెరతీసిందని కేటీఆర్ అన్నారు. అదానీకి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని బైలదిల్లా గనుల అక్రమ కేటాయింపుల నుంచి దృష్టి మరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తీరుగా... విశాఖ ఉక్కు పరిశ్రమ, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా కేంద్రం కుట్రలు చేసిన తీరును బీఆర్ఎస్ నిరంతరం లేవనెత్తుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టులో పాల్గొంటామన్న ఒక్క ప్రకటనతో కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు.