Telangana Assembly Election Results 2023 Political Leaders Varasalu: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో హస్తం గాలి వీచింది. రెండు సార్లు అధికారంలో కొనసాగిన భారత రాష్ట్ర సమితి- బీఆర్ఎస్ 40 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల కన్నా(64) ఎక్కువ సాధించిన కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పలువురు వారసులు ఎంట్రీ ఇచ్చారు. మరి అందులో గెలిచిందెవరు? ఓడిందెవరో ఈ స్టోరీలో చూద్దాం..
డాక్టర్.. ఎమ్మెల్యేగా..:మెదక్ స్థానం నుంచి 26 ఏళ్ల మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిపై గెలిచారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు కుమారుడైన రోహిత్‌రావు మేడ్చల్‌లోని మెడిసిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. రెండు గోల్డ్ మెడల్స్ సైతం సాధించారు. హైదరాబాద్‌లో వైద్యుడిగా ఉంటూనే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. మెదక్ నుంచి రోహిత్‌కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని మైనంపల్లి హన్మంత్‌రావు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయితే బీఆర్ఎస్ అందుకు నిరాకరించింది. దీంతో తండ్రీకుమారులిద్దరూ గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కోరుకున్న విధంగా మల్కాజిగిరి నుంచి హన్మంత్‌రావు.. మెదక్ నుంచి రోహిత్.. కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. పద్మాదేవేందర్‌రెడ్డిపై రోహిత్ 9వేలకుపైన మెజారిటీతో విజయం సాధించారు.
తండ్రి స్థానంలో తనయుడు: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా కల్వకుంట్ల సంజయ్ గెలుపొందారు. ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌పై విజయం సాధించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనయుడి కోసం తన సీటు త్యాగం చేశారు. కాగా, కోరుట్ల నియోజకవర్గం కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు కంచుకోట అని చెప్పొచ్చు. ఆయన ఇక్కడ్నించి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. గ్రామగ్రామాన బీఆర్ఎస్ క్యాడర్ అత్యంత బలంగా ఉంది.