Telangana Assembly Election Results 2023 Live BRS Sitting MLAs Defeated Who Leave Congress:తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో తేలిపోతున్నారు. అయితే.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయారు. 2018 ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత కారెక్కిన సంగతి తెలిసిందే. వారంతా.. ఈ సారి బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు. అయితే.. ఇందులో 9 మంది ఓటమిపాలయ్యారు. వారెవరు? ఏయే నియోజకవర్గాల్లో పోటీలో నిలిచారు? అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.
కందాళ ఉపేందర్ రెడ్డి :2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం గులాబీ పార్టీ నుంచి బరిలో నిలిచిన కందాళ.. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
రేగా కాంతారావు :పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత కాలంలో కారెక్కారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు చేతిలో ఓడిపోయారు. 2018లో పాయం టీఆర్ఎస్ తరపున.. రేగా కాంగ్రెస్ తరపున పోటీచేశారు.
బీఆర్ఎస్ మార్చిన అభ్యర్థుల్లో.. గెలిచిందెవరు? ఓడిందెవరు??
వనమా వెంకటేశ్వరరావు :2018లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున గెలిచారు వనమా. ఆ తర్వాత గులాబీ కండువా మెడలో వేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన ఆయనపై.. సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. సీపీఐకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది.
హరిప్రియా నాయక్ :ఇల్లెందు నియోజకవర్గంలో హరిప్రియ కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన ఆమె.. కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య చేతిలో ఓడిపోయారు. 2018లో వీరిద్దరే ప్రత్యర్థులుగా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కనకయ్య, కాంగ్రెస్ నుంచి హరిప్రియ పోటీచేశారు.
చిరుమర్తి లింగయ్య :నకిరేకల్ నియోజకవర్గంలో లింగయ్య కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచే బరిలో నిలిచిన ఆయనపై.. కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం విజయం సాధించారు. 2018లో వీరిద్దరే ప్రత్యర్థులుగా ఉన్నారు. అప్పుడు టీఆర్ఎస్ నుంచి వీరేశం, కాంగ్రెస్ నుంచి లింగయ్య పోటీచేశారు.