తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తేజస్వీకి అన్ని వేల పెళ్లి సంబంధాలా?

తేజస్వీ యాదవ్​... బిహార్​ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ ఆర్​జేడీ నేతకు దేశవ్యాప్తంగా గుర్తింపు అమాంతం పెరిగింది. మహాకూటమి గెలవకపోయినప్పటికీ ఎన్నికల్లో తేజస్వీ ముద్ర స్పష్టంగా కనిపించిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తేజస్వీ వయసు 31ఏళ్లు. అయితే ఆయనకు 44వేల పెళ్లి సంబంధాలు వచ్చాయంట! ఈ ఆర్​జేడీ నేతపై జీవితానికి సంబంధించిన మరిన్ని విశేషాలు చూసేద్దామా!

Tejaswi Yadav was offered 44,000 marriage proposals!
తేజస్వీ యాదవ్​కు ఇన్ని వేల పెళ్లి సంబంధాలు!

By

Published : Nov 11, 2020, 5:10 PM IST

బిహార్‌ 2020 ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్‌బంధన్‌ ఆధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. అయినా.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. పార్టీకి పెద్ద దిక్కు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అందుబాటులో లేకపోయినా.. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధించింది. ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌ తండ్రి లాలూ నీడ నుంచి బయటకు వచ్చి తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు. నితీశ్‌పై పదునైన అవినీతి ఆరోపణలు చేస్తూ భవిష్యత్తులో భాజపాను ఎదుర్కోగలననే సందేశం పంపారు.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రెండో కుమారుడైన తేజస్వీ యాదవ్‌ తొలుత క్రికెటర్‌ కావాలని కలలు కన్నాడు. లాలూ-రబ్రీ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో పట్నాలోని 1 అనీమార్గ్‌లోని బిహార్‌ చీఫ్‌ మినిస్టర్‌ రెసిడెన్స్‌లో క్రికెట్‌ సాధన చేస్తూ పార్టీ నేతలకు తేజస్వీ కనిపించేవారు. అప్పట్లో ఈ కుర్రోడు రాజకీయాల్లోకి వస్తాడని ఎవరూ అనుకోలేదు. క్రికెట్‌పై ఆసక్తితో 9వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పారు. కాకపోతే క్రికెట్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఝార్ఖండ్‌ తరఫున ఆయన ఫస్ట్‌ క్లాస్ ‌క్రికెట్‌ ఆడారు. కొన్ని మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపించినా.. తేజస్వీ పరుగుల సగటు 10 మాత్రమే. ఇక టీ20 క్రికెట్‌లో పరుగుల సగటు 3..! 2008-12 సీజన్‌ వరకు ఐపీఎల్‌లో దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ, ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. దీనిని సమర్థించుకోవడానికి లాలూ ఒక సారి "ఇప్పుడు మావాడు నీళ్లు, తువాళ్లు అందిస్తున్నాడు. తర్వాత బ్యాటింగ్‌ చేస్తాడు" అని తనదైన శైలిలో చమత్కరించారు.

సుశీల్‌ మోదీ కాళ్లకు మొక్కి..

2009 తర్వాత తేజస్వీ భవిష్యత్తుపై లాలూ ఓ అంచనాకు వచ్చారు. అదే ఏడాది రాజకీయాల్లోకి అరంగ్రేటం చేయించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి వాడుకొన్నారు. అదే సమయంలో ప్రచార కార్యక్రమానికి సిద్ధమవుతూ హెలిప్యాడ్‌ వద్ద వేచి ఉన్న భాజపా రాష్ట్ర నాయకుడు సుశీల్‌ కుమార్ మోదీని ఇద్దరు యువకులు వచ్చి కలిశారు. వారు ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకొన్నారు. వారిలో ఒకరు చిరాగ్‌ పాసవాన్‌ కాగా.. మరోకరు తేజస్వీ యాదవ్‌. వారిద్దరు ఎన్నికల ప్రచారానికి రావడం అదే తొలిసారి. వారిద్దరు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకున్న సుశీల్‌.. కొన్ని సూచనలు చేశారు. 11 ఏళ్ల తర్వాత అదే తేజస్వీ.. సుశీల్‌కు ప్రత్యర్థిగా నిలిచారు.

లాలూ మొగ్గు తేజస్వీకే..

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఇద్దరు కుమారులు. వారిలో తేజస్వీ యాదవ్‌ చిన్నవాడు. కానీ రాజకీయాల్లోకి ముందే వచ్చాడు. 2015 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తేజస్వీ రాఘోపూర్‌ నుంచి విజయం సాధించారు. అదే ఎన్నికల్లో ఆయన అన్న తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ మహువా నుంచి నుంచి గెలిచారు. నితీశ్‌ను సీఎంగా ప్రకటించే విషయంలో తేజస్వీ.. తండ్రి నిర్ణయాన్ని బహిరంగానే సమర్థించారు. "మా నాన్న బిహార్‌కు సామాజిక న్యాయం తెచ్చారు. ఇప్పుడు ఆర్థిక స్వావలంబన తెచ్చే సమయం ఆసన్నమైంది. బిహార్‌ను ముందుకు తీసుకువెళ్లడానికి నితీశ్‌ సరైన వ్యక్తి" అని పేర్కొన్నారు. లాలూ తన వారసుడిగా తేజస్వీని నిర్ణయించుకోవడంతో.. నితీశ్‌ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆయనకు రోడ్ల నిర్మాణ శాఖను కేటాయించారు. లాలూ ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఐఏఎస్‌ల బృందాన్ని ఆయనకు సహాయంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రోడ్లకు సంబంధించిన సమస్యలు ఉంటే నేరుగా తనకే పంపాలని తేజస్వీ వాట్సాప్‌ నంబర్‌ షేర్‌ చేశారు. అప్పుడు ఫిర్యాదుల సంగతేమోగానీ.. 44,000 పెళ్లి సంబంధాలు వచ్చాయి. 2017లో కూటమి నుంచి నితీశ్‌ బయటకు వచ్చి.. ఎన్డీఏలో చేరారు. అప్పుడు ఆయన్ను తేజస్వీ 'పాల్తూ చాచా' అని కామెంట్‌ చేశారు.

అన్నదమ్ముల కలహాలలో పతనం అంచుకు పార్టీ..

2019 ఎన్నికలు ఆర్జేడీకి పీడకల వంటివి. ఆ సమయంలో సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, సోదరి మీసా భారతితో విభేదాలు వచ్చాయి. తన రాజకీయ కార్యకలాపాలకు సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ అటంకాలు సృష్టిస్తున్నాడని తేజస్వీ ఫిర్యాదు చేశారు. వీరి విభేదాల ఫలితం ఎన్నికల్లో పార్టీపై పడింది. ఆర్జేడీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇక 2020 వచ్చే నాటికి పరిస్థితులు మారిపోయాయి. తేజస్వీ పార్టీలో శక్తిమంతమైన నేతగా అవతరించారు. ఆయన సభలకు జనం పోటెత్తారు. ప్రత్యర్థి నితీశ్‌ కుమార్‌పై పదునైన విమర్శలతో దాడి చేశారు. ఫలితంగా ఆర్జేడీ బిహార్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ఫిట్‌నెస్‌.. కొత్త సినిమాలు..

తేజస్వీకి సౌమ్యుడిగా పేరుంది. రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేసినా సహనంగానే ఉంటారు. సమయం దొరికితే యోగా చేయడం.. జిమ్‌లో గడపటం వంటివి చేస్తుంటారు. బిలియర్డ్స్‌ కూడా బాగా అడతారు. దీంతోపాటు మ్యూజిక్‌ వినడం.. నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సినిమాలు చూడటం ఆయనకు ఇష్టం.

ఇదీ చూడండి:-ఓడింది మహాకూటమే.. 'తేజస్వీ' కాదు!

ABOUT THE AUTHOR

...view details