స్థానిక భాషల్లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు సులభంగా సాంకేతిక విద్యకు అలవాటు పడటానికి కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక కోర్సులను మాతృభాషల్లోనే బోధించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. మాతృభాషలో బోధన వల్ల ఉన్నత విద్యలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది.
విద్యార్థులు ఇబ్బంది పడకుండా సాంకేతిక విద్యను అందిపుచ్చుకునేలా చేసి వారిలో ప్రతిభా పాఠవాలకు సానపెట్టేందుకు వీలుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా సాంకేతిక విద్యను మాతృభాషలోనే బోధించాలని యోచిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ పార్లమెంటుకు తెలిపారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.