TDP Chief Chandrababu Serious on Nandyala Issue: నంద్యాల జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తెలుగుదేశం వర్గాల ఘర్షణ ఘటనపై.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనపై పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి... ఘర్షణ వాతావరణానికి దారి తీసిన పరిణామాలపై అధ్యయనంతో.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిసల్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. వైసీపీ శ్రేణులు... తెలుగుదేశం కార్యక్రమాల్లోకి చొరబడి ఘర్షణలకు పురిగొలిపే చర్యలు కూడా చోటుచేసుకుంటున్నాయన్న చంద్రబాబు.. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని.. సూచించారు.
అసలేెం జరిగింది: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గం నుంచి నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో కొత్తపల్లి వద్ద లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు భూమా అఖిల ప్రియ వర్గీయులు, టీడీపీ నేత వర్గీయులు చేరుకున్నారు. లోకేశ్‌ను కలిసి వెళ్తున్న సమయంలో ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిల ప్రియ అనుచరులు దాడి చేశారు. లోకేశ్ ఎదుటే ఇరు వర్గీయుల నాయకులు బాహాబాహికి దిగారు. లోకేశ్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే.. అఖిలప్రియ దగ్గరుండి దాడి చేయించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో ఏవీ సుబ్బారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఏవీ సుబ్బారెడ్డిని వేరే వాహనం ఎక్కించి పంపించారు. లోకేశ్ పాదయాత్రలో తమ బలాన్ని చూపించుకోవడానికే భూమా అఖిలప్రియ వర్గీయులు దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపించారు.