Chamad Mata sacrifice: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా జిల్లా ఖేరాగడ్ తహసీల్దార్ పరిధిలోని బరిగ్వా గ్రామంలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ల బాలుడ్ని దేవతకు బలిచ్చాడు ఓ తాంత్రికుడు. చిన్నారి ఇంటి బయట ఆడకుంటుండగా ఎవరూ లేని సమయం చూసి కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. జూన్ 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందుతుడు భోళా అలియాస్ హుకం సింగ్ను అరెస్టు చేశారు. విచారణలో అతడు నేరం అంగీకరించాడు.
హుకం సింగ్ భూతవైద్యుడిగా పనిచేస్తున్నాడు. అయితే కొద్దిరోజులుగా అతని వద్దకు ఎవరూ వెళ్లడం లేదు. దీంతో చిన్నారిని దేవతకు బలిస్తే మంచి జరుగుతుందని భావించాడు. ఈ సమయంలోనే జూన్ 15న రామ్ అవతార్ కుమారుడు హృతిక్ ఓ బావి సమీపంలో ఆడుకుంటూ కన్పించాడు. ఎవరూ లేరని గమనించి అతడ్ని కిడ్నాప్ చేశాడు హుకం సింగ్. అనంతరం బాలుడ్ని గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి చామఢ్ మాతా పాదాల ముందు ఉంచాడు. ఆ మర్నాడు జూన్ 16న వేకువ జామున బాలుడి శవాన్ని ఊరికి దూరంగా ఎండిపోయిన కాలువలో పడేశాడు. అడవి జంతువులు శవాన్ని తింటే ఎలాంటి ఆనవాళ్లు ఉండవనుకున్నాడు.
అయితే బాలుడి శవాన్ని పడేస్తుండగా.. శెరూ అనే వ్యక్తి చూశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని, కుటుంబసభ్యులను రోజుకొకరి చొప్పున దేవతకు బలిస్తానని హుకం సింగ్ శెరూను బెదిరించాడు. కానీ అతడు ధైర్యంగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు వెంటనే తాంత్రికుడ్ని అరెస్టు చేశారు.