Tamil Nadu Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రభుత్వ బస్సును టాటా సుమో ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయనిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం మరో ఇద్దరు చనిపోయారు. ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. టాటా సుమోలో ప్రయానిస్తున్న వారు అన్నామలైయార్ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..తిరువణ్ణామలైలో జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. టాటా సుమో తిరువణ్ణామలై నుంచి బెంగళూరు వస్తుంది. ధర్మపురి నుంచి తిరువణ్ణామలై వైపుగా బస్సు వెళ్తోంది. ఈ రెండు వాహనాలు అంతనూర్ వద్ద ఢీకొన్నాయి. టాటా సుమోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు, బస్సులో వెళుతున్న వారిలో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టాటా సుమోలో ప్రయాణిస్తున్న వారిలో కొంత మంది స్వస్థలం అసోం అని.. వృత్తిరీత్యా బెంగళూరులో పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. టాటా సుమోలో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.
"ఘటనపై సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాం. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించాం. ఓ వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే చనిపోయాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఐదుగురు ఘటనాస్థలిలోనే చనిపోయారు." అని పోలీసులు తెలిపారు.
అసోంకు చెందిన పంచ రాయ్, నారాయణన్, విమల్, సాల్, నిఖాల్.. తమిళనాడుకు చెందిన కామరాజు, పునీత్ కుమార్(23) ఈ ఘటనలో మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు తమిళనాడు వాసులు, అసోంకు చెందిన సుబ్బన్న, కృష్ణప్ప, మిసోశ్ మిర్మి, రాబన్ గురా తిరువణ్ణామలై మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు వారు వెల్లడించారు.