ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ఒమిక్రాన్ వేరియంట్ తమిళనాడులోనూ వెలుగుచూసింది. అక్కడ తొలి కేసు నమోదైంది. నైజీరియా నుంచి చెన్నైకు తిరిగి వచ్చిన 47 ఏళ్ల వ్యక్తికి విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని వైద్య బృందాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎంఏ సుబ్రమణియన్ ధ్రువీకరించారు.
Omicron Cases In Maharashtra: అటు మహారాష్ట్రలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా మరో నలుగురికి కొత్త వేరియంట్ నిర్ధరణ అయింది. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 32కు చేరింది. మరోవైపు తెలంగాణలోనూ తాజాగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేరళలో మరో నలుగురికి బుధవారం ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు. దీంతో కేరళలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 5కు చేరినట్లు చెప్పారు. ఫలితంగా దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69కి చేరింది.
మరోవైపు.. జనవరిలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు.
"కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వచ్చే ఏడాది జనవరిలో మహారాష్ట్రలో ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి వేగంగా వ్యాప్తి చెందవచ్చు"
-డాక్టర్ ప్రదీప్ వ్యాస్, మహారాష్ట్ర ప్రజారోగ్య అదనపు ముఖ్య కార్యదర్శి