Tamil Nadu Neet Issue :రెండు సార్లు నీట్ పరీక్ష రాసిన ఉత్తీర్ణత సాధించలేకపోయాయని తమిళనాడుకు చెందిన జగదీశ్వరన్(19) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక అతడి తండ్రి.. సెల్వశేఖర్ కుడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొడుకు శనివారం ఆత్మహత్య చేసుకోగా.. తండ్రి ఆదివారం ప్రాణాలు తీసుకున్నాడు. రాజధాని చెన్నైలోని క్రోమ్‌పేటలో ఉన్న తమ ఇంట్లోనే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ రెండు మరణాలు తమిళనాడు ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. నీట్ పరీక్షను మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి.
తండ్రీకొడుకుల మృతిపై విచారం వ్యక్తం చేసినతమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్.. నీట్లో పరీక్షలో ఉత్తీర్ణత కాకపోతే అభ్యర్థులెవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో మంచి జీవితం ఉంటుందని.. ఆత్మవిశ్వాసంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ధైర్యంగా జీవించి.. ఇతరులను కూడా బతకనివ్వండని వారిని కోరారు. మరికొద్ది నెలల్లో రాజకీయ మార్పులు జరిగితే.. నీట్ అడ్డంకులు తొలగిపోతాయని స్టాలిన్ఆశాభావం వ్యక్తం చేశారు.
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని ఉద్దేశిస్తూ.. బిల్లుపై సంతకం చేయని వారందరూ అదృశ్యమవుతారన్నారు స్టాలిన్. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 'యాంటీ నీట్ బిల్'ను.. ఆర్ఎన్ రవివ్యతిరేకించడాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. నీట్లో ఉత్తీర్ణత కాలేదని జగదీశ్వరన్ ఆత్మహత్య చేసుకోవడం, అతని తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి ప్రకటించారు. జగదీశ్వరన్, అతని తండ్రి మృతి తనను కలచివేసిందని ఆయన పేర్కొన్నారు.
"జగదీశ్వరన్‌ను.. అతడి తల్లిదండ్రులు డాక్టర్‌గా చూడాలనుకున్నారు. కానీ జగదీశ్వరన్ ప్రాణాలు తీసుకున్నాడు. ఇది చాలా బాధకరమైన విషయం. అభ్యర్థులెవ్వరూ ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న నీట్ రద్దు అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది." అని స్టాలిన్ వెల్లడించారు.