Senthil Balaji Removed From Minister : తమిళనాట తీవ్ర దుమారం రేపిన మంత్రి సెంథిల్ బాలాజీ ఉద్వాసన వ్యవహారం మరో మలుపు తిరిగింది. మంత్రిగా సెంథిల్ బాలాజీ ఉద్వాసన ఉత్తర్వులను.. తమిళనాడు గవర్నర్ RN రవి నిలిపివేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని సీఎం స్టాలిన్‌కు కూడా గవర్నర్ తెలియజేశారని తెలిపాయి. అటార్నీ జనరల్‌ను సంప్రదించి.. సెంథిల్ బాలాజీ అంశంపై గవర్నర్ న్యాయసలహా తీసుకుంటారని సమాచారం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గవర్నర్ తాత్కాలికంగా సెంథిల్ బాలాజీ ఉద్వాసన నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Senthil Balaji RN Ravi : అంతకుముందు, మంత్రి సెంథిల్ బాలాజీని గవర్నర్ RN రవి బర్తరఫ్ చేశారు. ఈ మేరకు తమిళనాడు రాజ్ భవన్ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. బాలాజీ మనీలాండరింగ్ సహా అనేక కేసుల్లో తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని.. మంత్రిగా ఉంటే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బర్తరఫ్ చేస్తున్నట్లు రాజ్ భవన్ స్పష్టం చేసింది. గవర్నర్ నిర్ణయంపై అధికార డీఎంకే మండిపడింది. గవర్నర్‌కు అలాంటి హక్కు లేదన్న ముఖ్యమంత్రి స్టాలిన్.. న్యాయపరంగా పోరాడతామని ప్రకటించారు. పలు పార్టీలు కూడా డీఎంకేకు మద్దతు ప్రకటించాయి. సెంథిల్ బాలాజీని ED అరెస్టు చేయగా, ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం శాఖలేని మంత్రిగా కొనసాగుతున్నారు.
మరోవైపు గవర్నర్ ఆర్ఎన్ రవిపై డీఎంకే మండిపడింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లను అటించింది. అనేక కేసులు ఉండి.. కేంద్రమంత్రివర్గంలో కొనసాగుతున్న వారి ఫొటోలను ప్రదర్శించింది. రాజ్యాంగం ప్రకారం.. ముఖ్యమంత్రికి సమాచారం లేకుండా ఓ మంత్రిని తొలగించే హక్క గవర్నర్‌కు లేదన్నారు ఆ పార్టీ నేత ఇళంగోవన్. గవర్నర్ ఎప్పడూ రాజ్యాంగాన్ని గౌరవించలేదని ఆరోపించారు.
ఖండించిన విపక్షాలు
అంతకుముందు గవర్నర్ చర్యపై ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఓ మంత్రిని కేబినెట్‌ను తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని ఆరోపించారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం న్యాయపరంగా ఎదుర్కొంటుందని వెల్లడించారు. మంత్రిని తొలగించడాన్ని బీజేపీయేతర ప్రతిపక్షాలు ఖండించాయి. ఈ చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని హతమార్చడమే’ అని అభివర్ణించాయి.
ఆయనపై నమోదైన కేసు ఇదే
2016లో రవాణా శాఖలో నియామకాల కోసం లంచం తీసుకున్నారని సెంథిల్ బాలాజీపై ఆరోపణలున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయనపై ఈడీతో పాటు ఇతర జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2023 జూన్ 14న సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసింది ఈడీ. అనంతరం కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. అనుకోకుండా బాలాజీకి ఛాతినొప్పి రావడం వల్ల ఆయన ఆసుపత్రిలో చేరారు. జూన్ 21న బాలాజీకి సర్జరీ కూడా జరిగింది. దీంతోబాలాజీని కస్టడీలోకి తీసుకున్నప్పటికీ ఈడీ విచారణ చేయలేకపోయింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. జూలై 12 వరకు బాలాజీ ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు.