తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన ఏఎస్పీ బల్బీర్ సింగ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న కేసుల్లో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులకు.. బలవంతంగా పళ్లు పీకి ఏఎస్పీ చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిపట్ల కఠినంగా వ్యవరించిన ఏఎస్పీపై వెంటనే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ డిమాండ్ చేసింది. దీంతో ఈ విషయంపై నిజానిజాలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ అదే జిల్లాలోని ఓ సబ్ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరునెల్వేలి అదనపు పోలీసు సూపరింటెండెంట్ బల్బీర్ సింగ్.. తన పరిధిలో చిన్న చిన్న నేరాలకు పాల్పడే వ్యక్తులకు చుక్కలు చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బల్బీర్ సింగ్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిందితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి కటింగ్ బ్లేడ్‌తో పళ్లు లాగి దారుణంగా శిక్షించారని సంచలన ఆరోపణలు వచ్చాయి. తన పరిధిలో ఉన్న అంబసముద్రం, కల్లిడైకురిచ్చి, పాపకుడి తదితర ప్రాంతాల్లో పట్టుబడిన పది మందికి పైగా వ్యక్తుల దంతాలను బలవంతంగా పీకేసినట్లు బాధితులు చెబుతున్నారు.
ఏఎస్పీ బల్బీర్ సింగ్ చేతిలో గాయపడిన బాధితులు మూడు రోజుల క్రితం జమీన్ సింగంపట్టి ప్రాంతానికి చెందిన సూర్య అనే వ్యక్తి.. సీసీటీవీ కెమెరాను పగలగొట్టి ప్రజలకు ఇబ్బందులకు గురిచేశాడని ఏఎస్పీ బల్బీర్ సింగ్ అతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి బలవంతంగా పళ్లు తీయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదే కేసులో.. ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులను కూడా చిన్న కారణాలతో అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం వారి పళ్లను కూడా ఏఎస్పీ బల్బీర్ సింగ్ ఊడదీసినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ముగ్గురు పాళయంగొట్టై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరి కొందరు యువకులకు పళ్లు విరగ్గొట్టి, నోటిలో గులకరాళ్లు పెట్టి వేధించినట్లు సమాచారం.
"ఓ చిన్న కేసులో భాగంగా మా ముగ్గుర్ని అంబసముద్రం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఏఎస్పీ సార్ వచ్చి.. మా నోటిలో రాళ్లు వేసి దారుణంగా కొట్టారు. ఆ తర్వాత మా పళ్లు కూడా పీకేశారు. ఇటీవలే పెళ్లైన మా సోదరుడు మరియప్పన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి.. అతని మర్మాంగంపై చితకబాది చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు అతను మంచాన పడ్డాడు. మాకు జరిగింది మరెవ్వరికీ జరగకూడదు"
-- ఏఎస్పీ చేతిలో గాయపడిన బాధితులు
దీంతో బాధితులకు న్యాయం చేయాలని, ఏఎస్పీ బల్బీర్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని నేతాజీ సుభాష్ సేన నిర్వాహకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని తిరునెల్వేలి కలెక్టర్ కార్తికేయన్.. చేరన్మహాదేవి సబ్ కలెక్టర్ మహ్మద్ సబీర్ ఆలమ్‌ను ఆదేశించారు. ఈ ఆరోపణలు నిజమని తేలితే ఏఎస్పీపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.