మిగ్‌జాం తుపాను ప్రభావం- భారీగా వర్షాలు, రైలు పట్టాలపై నీరు- స్తంభించిన రవాణా వ్యవస్థ! Tamil Nadu Cyclone : మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడులో చెన్నై సహా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వడపళని, కాంచీపురంలలో రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెరుంగళత్తూరు సమీపంలోని తాంబరంలో వరద నీటిలో చిక్కుకున్న 15మందిని ఎన్డీఆర్ఎఫ్ సహాయ బృందాలు రక్షించాయి. చెన్నై సహా మూడు జిల్లాలకు ఆదివారం రెడ్ అలెర్ట్ జారీ చేయగా ఇవాళ మరో నాలుగు జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను హెచ్చరికల దృష్ట్యా చేపలవేట కోసం జాలర్లు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు.
పురపాలక సిబ్బందికి సామగ్రి పంచుతున్న క్రీడాశాఖ మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్
భారీ వర్షాలకు నీట మునిగిన చెన్నై నగరం
పట్టాలపై నీరు- చెట్లు నేలపై..
చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తుండడం వల్ల ఎన్నో ఏళ్ల నాటి మహా వృక్షాలు సైతం నెలకూలాయి. వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు ఇంటి బయట కాళ్లు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, మిగ్‌జాం తుపాను కారణంగా చెన్నై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని ఆలస్యంగా నడవనున్నాయని తెలిపారు.
ఐఎండీ రిపోర్ట్..
మిగ్‌జాం తుపాను డిసెంబర్ 5న సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్లకు దగ్గరగా తీరాన్ని తాకే సూచనలు కనిపిస్తున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఇక తుపాను ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నందున పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించింది అక్కడి హెం శాఖ.
ఆస్పత్రులను కూడా..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం ప్రభుత్వాస్పత్రులపై కూడా పడింది. చెన్నైలోని తాంబరం సర్కార్ దవాఖానాలో మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరింది. సైదాపేటలోని అరంగనాథన్ సబ్‌వే నీట మునిగింది. మరోవైపు వరద కారణంగా అలందూరులోని తిల్లై గంగా నగర్ సబ్‌వేను మూసివేశారు.
'రేపటికి తుపాను తీవ్ర రూపం..'
'మిగ్‌జాం తుపాను చెన్నైకి తూర్పు-ఈశాన్యానికి 100 కి.మీ దూరంలో ఉంది. సోమవారం తెల్లవారుజామున ఇది గంటకు 10 కి.మీ వేగంతో కదిలింది. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతుందని భావిస్తున్నాము. ఈరోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో తుపాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో నెల్లూరు-మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని అంచనా. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో తుపాను ప్రభావం ఈ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది' అని చెన్నై రీజినల్ మెట్రాలజీ డైరెక్టర్ బాలచంద్రన్ పేర్కొన్నారు.
వరదలపై సీఎం రివ్యూ..
అతి భారీ వర్షాల నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. 'మంత్రులు, అధికారులు ఇప్పటికే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప తుపాను ప్రభావం తగ్గే వరకు ఎవరూ బయటకు రావద్దు' అని సీఎం విజ్ఞప్తి చేశారు.
70 విమానాలు రద్దు..
భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన దాదాపు 70 విమానాలు రద్దయ్యాయి. ఉదయం 9 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 40 నిమిషాల మధ్యలో షెడ్యూల్ చేసిన పలు విమాన కార్యాకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఫ్లైట్స్ ల్యాండ్, టేకాఫ్ అయ్యే రన్‌వేపై పెద్ద ఎత్తున నీరు చేరడం వల్ల దానితో పాటు టార్మాక్‌ను మూసివేశారు అధికారులు. దీంతో భారతీయులతో పాటు విదేశీ ప్రయాణికులు ఇబ్బుందులు ఎదుర్కొన్నారు.
ఎయిర్‌పోర్టులో రన్‌వేపై నిలిచిన వరద నీరు
మిజోరంలో ఓట్ల లెక్కింపు- ప్రతిపక్ష ZPM బోణీ, ఉపముఖ్యమంత్రి ఓటమి
94 ఓట్ల తేడాతో ఓడిన ఉపముఖ్యమంత్రి- 16 ఓట్లతో బీజేపీ అభ్యర్థి విన్- ఛత్తీస్‌గఢ్‌లో ఆసక్తికర ఫలితాలు