తమిళనాడులో గత లోకసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన డీఎంకే తాజా శాసనసభ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించింది. ద్రవిడ ఉద్యమ నేత కరుణానిధి వారసుడు 'దళపతి' ఎం.కె.స్టాలిన్(68) ముఖ్యమంత్రి కానున్నారు. శాసనసభలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్లు కావాల్సి ఉంది. మిత్రపక్షాలు కాకుండా డీఎంకే ఒక్కటే 131 స్థానాల్లో గెలుపు, ఆధిక్యం సంపాదించి సర్కారు నడపడానికి అవసరమైన మెజార్టీని పొందింది. ఇతర మిత్రపక్షాలతో కలిసి 157 సీట్లు లభించే అవకాశం ఉంది. 155 సీట్లలో గెలిచిన ఈ కూటమి.. మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
గట్టి పోటీ
పోటీ ఏకపక్షంగా ఉంటుందని తొలుత కొన్ని వర్గాలు భావించినా, ఇంతవరకు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే గట్టి పోటీనే ఇచ్చింది. జయలలితలాంటి ఆకర్షణీయమైన నేతలు ఎవరూ లేనప్పటికీ 72 స్థానాల్లో గెలుపొందింది. బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ కూటమికి మొత్తంగా 74 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు అందిన లెక్కల ప్రకారం డీఎంకే 37.6 % ఓట్లను సంపాదించగా, అన్నాడీ ఎంకే 33.4 % ఓట్లను పొందడం గమనార్హం. డీఎంకేతో పొత్తు పెట్టు కున్న కాంగ్రెస్ 16 చోట్ల విజయం సాధించింది.