Actor loses Crores in Iridium Scam: ప్రముఖ తమిళ నటుడు విఘ్నేశ్.. చెన్నై కమిషనర్ ఆఫీస్‌ను ఆశ్రయించాడు. 'ఇరీడియమ్ స్కాం' ముఠా చేతిలో రూ. కోటీ 81 లక్షలు మోసపోయినట్లు సోమవారం ఫిర్యాదు చేశాడు.
గిండి ఇండస్ట్రియల్ ఏరియాలోని తన సొంత భవనంలో సెలూన్ షాప్ నిర్వహిస్తున్న రాంప్రభు.. స్నేహం పేరుతో తనను మోసం చేశాడని చెప్పాడు విఘ్నేశ్. ఇరీడియం వ్యాపారం చేస్తున్నానని.. రూ. 5 కోట్లు ఇస్తే, 500 కోట్లు ఇప్పిస్తానని చెప్పాడని పోలీసులకు వివరించాడు. అతని వద్ద సెక్యూరిటీ గార్డులు, కారుకు సైరన్ చూసి వీఐపీ అనుకున్నానని, అందుకే నమ్మాల్ని వచ్చిందని తెలిపాడు విఘ్నేశ్.
''భారతీ రాజా దర్శకత్వం వహించిన సీమైయిలే, పసుంపన్లో సహా ఎన్నో తమిళ సినిమాల్లో నటించాను. దాదాపు 30 ఏళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా. రాంప్రభు నాతో స్నేహం చేశాడు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో.. ఇరీడియం అనే పదార్థాన్ని ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీకి విక్రయిస్తున్నానని చెప్పాడు. దీని విలువ రూ. 3 లక్షల కోట్లు అన్నాడు. అందుకే ప్రభుత్వం పోలీసు భద్రత ఏర్పాటు చేసిందని అతను చెప్పాడు.''
- విఘ్నేశ్, తమిళ నటుడు
చట్టబద్ధంగానే ఇరీడియంను విక్రయిస్తున్నానని, ఇందులో మంచి లాభాలు ఉంటాయని రాంప్రభు చెప్పిన మాటల పట్ల ఆకర్షితుడైనట్లు విఘ్నేశ్ పేర్కొన్నాడు. చెన్నై స్టార్ హోటల్స్, ఫాంహౌస్‌లో ప్రభుతో కలిసి.. ఎన్నో సార్లు పెద్ద పెద్ద వాళ్లతో సమావేశాలకు కూడా వెళ్లినట్లు పోలీసులకు చెప్పాడు.