ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో ఓ విచిత్రకర ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భర్తలను వదిలేసి ప్రభుత్వ పథకం కింద వచ్చిన సొమ్ముతో తమ ప్రియులతో పారిపోయారు ఐదుగురు మహిళలు. పేదలకు సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో 2015లో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పట్టణం) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా వచ్చిన మొత్తాన్ని తీసుకొని మహిళలు జంప్ అయ్యారు. ఆవాస్ యోజన కింద.. భూమి ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. మొదటి విడత కింద రూ.50,000, రెండో విడతలో రూ.1,50,000 చివరగా మూడో ఇన్స్టాల్మెంట్ కింద మరో రూ.50,000లను మహిళల బ్యాంకు ఖాతాల్లో జమా చేస్తోంది.
మోదీ ఇచ్చిన రూ.50వేలు తీసుకొని.. భర్తల్ని వదిలేసిన మహిళలు.. ప్రియులతో కలిసి జంప్! - 5 UP Women Left Husbands And Ran With Lovers
ఉత్తర్ప్రదేశ్లో ఐదుగురు మహిళల నిర్వాకం గురించి వింటే.. ఇలా కూడా చేస్తారా అని అనిపించక మానదు. ఎందుకంటే ఏకంగా కేంద్ర ప్రభుత్వ పథకం నిధులు తీసుకొని తమ ప్రియులతో కలిసి పారిపోయారు కొందరు గృహిణులు. పూర్తి వివారాల్లోకి వెళ్తే..
అయితే రాష్ట్రంలోని బారాబంకీ జిల్లా నుంచి ఇటీవల 40 మంది లబ్ధిదారులుగా మహిళలను ఎంపిక చేశారు అధికారులు. కొందరు మహిళలకు మొదటి ఇన్స్టాల్మెంట్ కింద రూ.50,000లను వారి ఖాతాల్లో జమా చేశారు. ఇక అకౌంట్లలో నగదు పడ్డ వెంటనే ఐదుగురు మహిళలు తమ భర్తలను వదిలేసి ప్రియులతో కలిసి ఉడాయించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కంగుతిన్నారు.
మొదటి విడత నగదు జమా చేసిన తర్వాత కూడా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంపై.. జిల్లా పట్టణాభివృద్ధి శాఖ అధికారి సౌరభ్ త్రిపాఠి సంబంధిత మహిళల ఇళ్లకు నోటీసులు పంపారు. కాగా, ఈ లబ్ధిదారులు నిర్ణీత గడువులోగా గృహ నిర్మాణ పనులు ప్రారంభించకుంటే.. జమా చేసిన సొమ్మును తమ భర్తల నుంచే రికవరీ చేస్తామని తెలిపారు. ఇకపోతే రెండో విడత డబ్బులను ఎట్టిపరిస్థితుల్లోనూ జమా చేయొద్దని బాధిత భర్తలు అధికారులను వేడుకున్నారు. ఇంతకుముందు యూపీలోని ఐదు నగరపంచాయతీలైన సత్రిఖ్, జైద్‌పూర్, బంకి, ఫతేపుర్, బెల్హారాలలో కూడా అచ్చం ఇదే తరహా ఘటనలు జరిగాయని అధికారులు చెబుతున్నారు.