కరోనా మహమ్మారి కారణంగా 60 రోజులుగా మూతపడిన ప్రపంచ ప్రఖ్యాత కట్టడం.. తాజ్‌మహల్ తిరిగి తెరుచుకుంది. మళ్లీ సందర్శకుల సందడి మొదలైంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న క్రమంలో పురావస్తు శాఖ పరిధిలోని అన్ని స్మారక కట్టడాలు, స్థలాలు, ప్రదర్శనశాలల్ని బుధవారం తెరిచారు.
ఒకసారి 650 మందికి మాత్రమే తాజ్‌మహల్ పరిసరాల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఇతర కట్టడాల విషయంలో ఇలాంటి నిబంధనలు లేవని వెల్లడించారు.
తెల్లవారు జామునే...
తాజ్‌మహల్ వద్ద కొవిడ్ నిబంధనలు పాటించేలా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ వంటి అన్ని చర్యలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామునే బ్రెజిల్‌కు చెందిన మెలిస్సా డలరోజా, ఘజియాబాద్‌కు చెందిన ఓ కుటుంబం ప్రేమ సౌధాన్ని చూసేందుకు వచ్చారు. తాజ్‌మహల్‌ను చూడాలని ముందుగానే ప్రణాళిక వేసుకున్నా.. లాక్‌డౌన్‌తో మూతపడటం వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఓ కుటుంబం తెలిపింది. లాక్డౌన్ తర్వాత తొలిరోజునే సందర్శించటం చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొంది.