Swachhata Hi Seva 2023 :మహాత్మాగాంధీ జయంతి వేళ ఆయనకు స్వచ్ఛాంజలి సమర్పిద్దామని గతనెల మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు.. దేశవ్యాప్తంగా గంటపాటు 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రుల నుంచి విద్యార్థుల వరకు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంటపాటు శ్రమదానం చేసి పరిసరాలను శుభ్రం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా 9.20లక్షల ప్రదేశాల్లో ఈ మెగాడ్రైవ్‌ను నిర్వహించారు.
నాకు రెండు విషయాల్లో క్రమశిక్షణ లేదు : మోదీ
PM Modi Swachata Hi Seva : ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రెజ్లర్ అంకిత్ బైయన్‌పురియాతో కలిసి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా రెజ్లర్‌తో పలు విషయాలను షేర్ చేసుకున్నారు. కేవలం పరిశుభ్రత మాత్రమే కాకుండా.. ఫిట్‌నెట్, వెల్బీయింగ్ కూడా మిళితం చేశామని తెలిపారు. ఇది స్వచ్ఛ భారత్, స్వస్త్ భారత్ గురించి అని చెప్పారు. ఈ సందర్భంగా సరైన సమయానికి తినడం, నిద్రపోవడం వంటి రెండు విషయాల్లో తనకు క్రమశిక్షణ లేదని మోదీ చెప్పారు.
అమిత్ షా శ్రమదానం..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్వచ్ఛ శ్రమదానం నిర్వహించారు. బీజేపీ నాయకులతో కలిసి చీపురు పట్టుకుని.. వీధులను శుభ్రం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లోనే.. స్వచ్ఛత అభియాన్‌లో పాల్గొన్నారు.
ఇది మహాత్మాగాంధీ దార్శనికత..
దిల్లీలోని అంబేడ్కర్ బస్తీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఇతర నేతలు స్వచ్ఛత అభియాన్‌లో పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్న మహాత్మాగాంధీ దార్శనికత.. ముందు తరాలకు కూడా అందుతుందని జేపీ నడ్డా చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలంతా.. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు.