తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వసూళ్ల పర్వంలో మరో ఇద్దరు 'మహా' మంత్రులు!

వసూళ్ల పర్వంలో మరో ఇద్దరు మంత్రులు ఉన్నారని ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టై ఎన్​ఐఏ కస్టడీలో ఉన్న పోలీసు అధికారి సచిన్​ వాజే ఆరోపించారు. ఈమేరకు ఎన్​ఐఏకు రాసిన లేఖ సంచలనంగా మారింది.

sachin waze
వసూళ్ల పర్వంలో మరో ఇద్దరు మంత్రులు

By

Published : Apr 8, 2021, 5:17 AM IST

ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం, దాని యజమాని మన్​సుఖ్​ హిరేన్ హత్య కేసులో అరెస్టై ఎన్​ఐఏ కస్టడీలో ఉన్న పోలీస్ అధికారి సచిన్ వాజే మరో బాంబు పేల్చారు. ఇప్పటికే నెలకు రూ.100 కోట్లు వసూలు చేయమని పోలీసులను మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ ఆదేశించారంటూ ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్​బీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలతో అనిల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాజే.. ఎన్​ఐఏకు రాసిన 4 పేజీల లేఖ కలకలం రేపుతోంది. లేఖలో అనిల్​పై పరమ్​బీర్​ చేసిన ఆరోపణలు నిజమేనని వాజే ధ్రువీకరించారు. ఇంకో ఇద్దరు మంత్రులు ప్రమేయంపైనా సంచలన విషయాలు బయటపెట్టారు.

వాజే సంచలన లేఖ

2004లో ఓ కేసుకు సంబంధించి వాజేను సస్పెండ్ చేశారు. 2020లో తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకున్నారు. తన నియామకం.. ఎన్సీపీ అధినేత శరద్​పవార్​కు ఇష్టం లేదని వాజే పేర్కొన్నారు.

సచిన్​ వాజే రాసిన లేఖ

"నన్ను తీసుకోవద్దని పవార్ చెప్పారు. సస్పెండ్ చేయమన్నారు. ఆ సమయంలో హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్.. రూ.2 కోట్లిస్తే శరద్​ పవార్​ను ఒప్పిస్తానన్నారు. అంత మొత్తం చెల్లించలేనని చెప్పాను. తర్వాత ఇవ్వమన్నారు. దక్షిణ ముంబయిలో ఓ అతిథి గృహంలో జరిగిన సమావేశంలో సైఫీ బుర్హానీ అప్​లిఫ్ట్​మెంట్ ట్రస్ట్​పై విచారణ గురించి నాతో హోంమంత్రి మాట్లాడారు. రూ. 50 కోట్లిస్తే విచారణ ముగిస్తామని చెప్పి.. ఆ ట్రస్ట్ నుంచి రూ.50 కోట్లు వసూలు చేయమన్నారు. ఆ ట్రస్టు సభ్యులెవరూ తెలియదని చెప్పాను. జనవరిలో మళ్లీ అధికారిక నివాసానికి పిలిపించుకుని, ముంబయిలోని 1650 బార్ల నుంచి రూ. 100 కోట్లు వసూలు చేయమని చెప్పారు. ఒక్కో బార్​ నుంచి 3 నుంచి 3.5 కోట్లు రాబట్టాలని అన్నారు. అది నా పరిధిలో లేదని చెప్పా. ఆ సమయంలోనే నన్ను ఉద్యోగంలో ఉంచినందుకు డిమాండ్ చేసిన రూ. 2 కోట్లు గురించి దేశ్​ముఖ్​ ప్రస్తావించారు. ఈ ఏడాది జనవరిలో (శివసేన) మంత్రి అనిల్ పరబ్ పిలిచి.. బృహన్ ముంబయి కార్పొరేషన్​లో 50 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున వసూలు చేయాలని ఆదేశించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సన్నిహితుడనంటూ దర్శన్ అనే ఓ వ్యక్తి కూడా నవంబర్​లో నన్ను కలిశారు. అక్రమ గుట్కా వ్యాపారస్తుల నుంచి రూ. 100 కోట్లు వసూలు చేయమని చెప్పారు. అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయనని చెప్పేసరికి, ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని దర్శన్ హెచ్చరించారు" అని లేఖలో వాజే పేర్కొన్నారు.

ఎన్​ఐఏకు లేఖ రాసిన సచిన్ వాజే

మరోవైపు వాజే.. ఎన్​ఐఏ కస్టడీని ఏప్రిల్​ 9 వరకు పొడిగించారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు అనిల్ దేశ్​ముఖ్​పై వచ్చిన ఆరోపణలపై విచారిస్తున్న సీబీఐ.. వాజేను కూడా ప్రశ్నించనుంది. వాజే ఆరోపణలను మంత్రి పరబ్ ఖండించారు. సచిన్​ వాజేపై ముంబయి పోలీసు విభాగం కూడా తన నివేదికను ప్రత్యేక ఎన్​ఐఏ కోర్టుకు సమర్పించింది. అందులో ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్​బీర్- వాజే సంబంధాలను ప్రస్తావించింది.

ఇదీ చదవండి:వేర్వేరు ప్రమాదాల్లో 8మంది మృతి

ABOUT THE AUTHOR

...view details