కేరళలో కలకలం సృష్టిస్తున్న నిఫా వైరస్(Nipah Virus) కర్ణాటకకు వ్యాపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళూరులో వైరస్ సోకిన ఓ అనుమానితుడిని గుర్తించినట్లు ఆ రాష్ట్ర హెల్త్ కమిషనర్ కేవీ తిలక్ చంద్ర పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేవని, ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని తెలిపారు. బాధితుడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్ష కోసం పంపినట్లు స్పష్టం చేశారు.
బాధితుడు మంగళూరులోని ప్రభుత్వ వెన్లాక్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లు అధికారి తెలిపారు. ఇటీవలే అతడు గోవాకు వెళ్లాడని.. కేరళకు(Nipah Kerala) చెందిన ఓ వ్యక్తితో అతడు కాంటాక్ట్ అయినట్లు తెలిసిందని అన్నారు. ఈ నేపథ్యంలో మంగళూరు ప్రజలను అలర్ట్‌గా ఉండాలని సూచించారు అధికారులు.
"కేరళ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారిని పరీక్షించాలని జిల్లా అధికారులకు సూచించాం. సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేశాం. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట మొదలైన లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించాం."
--తిలక్ చంద్ర, హెల్త్ కమిషనర్.
వైరస్ లక్షణాలున్న వ్యక్తికి సంబంధించిన పరీక్ష ఫలితాలు మరో రెండు రోజుల్లో రానున్నట్లు దక్షిణ కన్నడ జిల్లా వైద్యాధికారి స్పష్టం చేశారు.