Mcafee Survey 2022: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వాడకం భారీగా పెరిగింది. చిన్నారుల చేతుల్లోకి అవి వచ్చేశాయి. టచ్‌స్క్రీన్లపై నేర్పుగా కదులుతున్న చిట్టిచేతులు.. ఆన్‌లైన్ ప్రపంచపు ద్వారాలు తెరుస్తున్నాయి. ఈ విషయంలో భారత చిన్నారులు ముందున్నారు. ప్రపంచ సరాసరితో పోలిస్తే వీరు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్‌ను ఔపోసన పట్టేస్తున్నారు. 10-14 ఏళ్ల ప్రాయంలోనే 'మొబైల్ మెచ్యూరిటీ' సాధిస్తున్నారు. ఇదే సమయంలో మన చిన్నారులు ఆన్‌లైన్ బెదిరింపులనూ ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు. కంప్యూటర్ భద్రత సాఫ్ట్‌వేర్ సంస్థ 'మెకాఫే' నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెలుగు చూశాయి. 'లైఫ్ బిహైండ్ ద స్క్రీన్స్ ఆఫ్ పేరెంట్స్, ట్వీన్స్ అండ్ టీన్స్' పేరిట విడుదలైన నివేదికలో కీలకాంశాలున్నాయి.
చిన్నారుల స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై 'మెకాఫే' నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
- మన దేశ పిల్లల్లో 22 శాతం మంది ఏదో ఒక సమయంలో సైబర్ బెదిరింపులను ఎదుర్కొన్నారు. ప్రపంచ సరాసరి (17 శాతం) కన్నా ఇది 5 శాతం అధికం.
- సామాజిక మాధ్యమాల్లో సైబర్ బెదిరింపులు, దుర్భాషలపై భారత తల్లిదండ్రుల్లో ఆందోళన 47 శాతం మేర ఉంది. ఈ విషయంలో ప్రపంచ సరాసరి 57 శాతంగా ఉంది.
- భారత్‌లో పిల్లలు, యుక్త వయస్కులు స్మార్ట్‌ఫోన్లు, గేమింగ్ కన్సోల్స్‌ను తమకు ఇష్టమైన సాధనాలుగా చెబుతున్నారు.
- భారత్‌లో పదిహేనేళ్ల లోపు వయసు పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం 83 శాతంగా ఉంది. ఈ విషయంలో ప్రపంచ సరాసరి 76 శాతం మాత్రమే.
- సామాజిక మాధ్యమాల్లో సైబర్ బెదిరింపులు, దుర్భాషలపై భారత తల్లిదండ్రుల్లో ఆందోళన 47 శాతం మేర ఉంది. ఈ విషయంలో ప్రపంచ సరాసరి 57 శాతంగా ఉంది.
10-12 ఏళ్లు, టీనేజీ జీవితాల్లో గోప్యత:ఆన్‌లైన్‌లో సంధానమయ్యే చిన్నారులు, టీనేజీవారు ఏకాంతం, రక్షణ కోరుకుంటున్నారు. బ్రౌజర్ చరిత్రను తొలగించడం నుంచి ఆన్‌లైన్‌లో తమ కార్యకలాపాల ఆనవాళ్లను చెరిపేయడం వరకూ ప్రపంచవ్యాప్తంగా 59 శాతం మంది చిన్నారులు తమ ఇంటర్నెట్ జీవితాలను గోప్యంగా ఉంచాలనుకుంటున్నారు.
- వాస్తవ వివరాలు తెలుసుకోకుండానే ఒక వ్యక్తితో ఆన్‌లైన్‌లో ప్రైవేటు సంభాషణలు జరిపినట్లు వెల్లడించిన భారతీయ చిన్నారులు.. ప్రపంచ సరాసరి కన్నా 11 శాతం అధికంగా ఉన్నారు.