పోలీసుల పేర్లతో మాయమాటలు చెప్పి ఓ వ్యక్తిని ముగ్గులోకి దించారు కొందరు దుండగులు. అతడిని భయపెట్టి రూ.16.50 లక్షలు కాజేశారు. గుజరాత్‌లోని సూరత్ నగరంలో జరిగిందీ ఘటన. ఈ కేసులో నలుగురు మహిళలు సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మధ్యవయసులో ఉన్న బాధితుడికి డిసెంబర్ 7న సోషల్ మీడియాలో ఓ మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. క్రమంగా వీరిద్దరూ స్నేహితులుగా మారారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ మహిళ తాను సూరత్‌లోనే ఉంటున్నానని బాధితుడికి చెప్పింది. వీడియో కాల్స్ చేసి తనను కలవాలని సూచించింది. వరాఛా ప్రాంతంలోని సీతానగర్ అవుట్‌పోస్ట్ వద్ద కలవాలని చెప్పింది. బాధితుడు ఆమెను కలిసేందుకు వెళ్లాడు. ఆ మహిళ అతడిని హరిధామ్ సొసైటీ సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లింది. గదిలోకి తీసుకెళ్లి అతడితో అనుచితంగా వ్యవహరించింది.
ఈ సమయంలోనే ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి దూసుకొచ్చారు. తాను ఆ మహిళ భర్తనని పేర్కొంటూ బాధితుడిపై దాడి చేశాడు. మరో వ్యక్తి తాను మహిళ సోదరుడిని అని చెబుతూ బాధితుడిని కొట్టాడు. బాధితుడి ఫోన్ లాక్కొని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. రేప్ కేసు పెడతామని హెచ్చరించారు. అప్పుడే మరో వ్యక్తి వచ్చి మధ్యవర్తిలా నటించాడు. రూ.8.50 లక్షలు ఇస్తే సమస్య పరిష్కారమయ్యేలా చేస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసుకోవాలని భావించాడు.